సామాన్యులకు ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

సామాన్యులకు ధరాఘాతం

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

సామాన్యులకు ధరాఘాతం ప్రస్తుతం భగ్గుమంటున్న నిత్యావసరాలు

ఎన్నడూ లేనంతగా ధరలు

దళారుల పాత్ర పెరిగింది

సాక్షి ప్రతినిధి,ఏలూరు : ఉప్పు, పప్పు నుంచి బి య్యం వరకూ అన్నింటి ధరలు ఒక్కసారిగా ఆకాశానంటుతున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు ఆహారధాన్యాల కొరత ఎల్‌నినో ప్రభావంతో అధికంగా ఉంటుందని అందరూ పొదుపు చర్యలు పాటించాలన్న హడావుడి ప్రచారాల నేపథ్యంలో మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించారు. దళారీ వ్యాపారులు వచ్చేందే అవకాశం అన్నట్లు అన్ని ధరలను భారీగా పెంచేశారు. ప్రధానంగా గత రెండు నెలల వ్యవధిలో బియ్యం, బెల్లం, పంచదార, నూనె ధరలు ఏకకాలంలో 30 శాతానికిపైగా పెరగడమే నిదర్శనం. పామాయిల్‌, పంచదార, బెల్లం, మినపప్పు, బియ్యం, మినపగుళ్లు, వెల్లుల్లి ఇలా అన్నిరకాల్లో ధరల పెరుగుదల కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే కొన్ని రకాల సరుకుల ధరలు 50 శాతం వరకూ పెరిగాయి.

ఎల్‌నినో సాకు.. కృత్రిమ కొరత

వాస్తవానికి జిల్లాలో ధాన్యం కొరత ఎక్కడా పెద్దగా లేదు. అలా అని మార్కెట్‌లో పెరిగిన బియ్యం ధరలకు అనుగుణంగా ధాన్యం ధర పెరగలేదు. మూడు నెలల క్రితం ముగిసిన రబీలో ధాన్యం సగటున రూ.1,750కు క్వింటాల్‌ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఖరీఫ్‌లోనూ అదే ఉంది. కాని బియ్యం ధర మాత్రం క్వింటాల్‌కు రూ.1,400 నుంచి రూ.2 వేల వరకు పెరిగింది. జిల్లావ్యాప్తంగా గోడౌన్లల్లో భారీగా నిల్వలు ఉన్నాయి. బియ్యం ధరలు పెరిగాయని హడావుడిగా రైతుబజార్లల్లో బియ్యం కొనుగోలు షాపులు ఏర్పాటుచేశారు. మార్కెట్‌లో రూ.60 లకు లభ్యమయ్యే కొత్త బియ్యాన్ని రూ.50–రూ.52 ధరలతో విక్రయిస్తున్నారు. అది కూడా ఒక మనిషికి ఆధార్‌కార్డు ద్వారా 10 కేజీల చొప్పున రోజూ 10, 15 మందికి మాత్రం విక్రయించి చేతులు దులుపేసుకుంటున్నారు. కృత్రిమ కొరతను అడ్డుకోవడానికి ఏర్పాటుచేశామని అధికారులు ప్రకటించుకుని సమస్యను గాలికి వదిలేశారు.

మధ్యతరగతిపై రూ.20 కోట్ల భారం

జిల్లాలో మధ్యతరగతి ప్రజలపై నిత్యావసర సరు కుల ధరల పెంపు రూ.20 కోట్ల పైమాటే. నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా విని యోగించే బియ్యం, నూనె, బెల్లం, పంచదార ధరలతో పాటు అపరాల ధరలు కూడా పెరగడంతో రూ.5 వేల నిత్యావసరాల సరుకులపై రూ.600 నుంచి 850కు అదనపు భారం పడింది. ఈ క్రమంలో జిల్లాలో అదనపు భారంతో మధ్యతరగతి వా సులు బెంబేలెత్తుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్ర భుత్వ హయాంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఏటా లబ్ధి చేకూరింది. ఇ ప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేకపోవడంతో అనివార్యంగా అధిక వడ్డీ అప్పుల బాట తప్పడం లేదు.

ఏలూరులో ప్రైవేట్‌ ఉద్యోగి కుమార్‌ జీతం నెలకు రూ.40 వేలు . ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నిత్యావసరాలు, కూరగాయలు, వారంలో ఒకసారి నాన్‌వెజ్‌, నెలకోసారి హోటల్‌ భోజనం ఇలా అన్నింటికీ జీతంలో నుంచి ఖర్చు చేస్తుంటాడు. పండుగలు, పబ్బాలు, పుట్టినరోజులు వస్తే రూ.10 వేలు అప్పు చేయాల్సిన పరిస్థితి. తాజాగా పెరిగిన నిత్యావసరాల ధరలతో నెలకు సగటున రూ.3 వేల వరకు అదనపు భారం పడుతోంది. దీంతో అప్పు అనివార్యమైంది. ఇది ఒక్క కుమార్‌ పరిస్థితే కాదు.. సగటు మధ్యతరగతి వ్యక్తి దుస్థితి.

బెల్లం, పంచదార, నూనె, బియ్యం ధరలు భారీగా..

ఎల్‌నినో పేరుతో ఆహార ధాన్యాల కొరత అంటూ హడావుడి

గతేడాదితో పోలిస్తే 50 శాతానికిపైగా భారం

మధ్యతరగతి జీవనంపై తీవ్ర ప్రభావం

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

నిత్యావసర సరుకుల ధరల మంటతో మధ్యతరగతి జనం గుండె గుబేలుమంటోంది. ఎల్‌నినో భయాలను ఆసరాగా చేసుకుని దళారులు సృష్టించిన కృత్రిమ కొరత సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఉప్పు, పప్పు నుంచి పూట గడిచే బియ్యం వరకూ ప్రతి దాని ధర రెండు నెలల్లోనే 30 శాతానికి పైగా ఎగబాకడంతో ఇళ్లల్లో నెలవారీ బడ్జెట్‌ తలకిందులై సామాన్యులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు.

నిత్యావసరాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మాలాంటి పేదలకు భారంగా మారిపోతున్నాయి. ధరలు కొంతకాలం పెరిగినా మళ్లీ తగ్గుతాయనే ఆశ ఉండేది. కానీ ప్రస్తుతం గత కొన్ని నెలలుగా ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. నెలల వ్యవధిలో ఇంత ఎక్కువగా ధరలు పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఉప్పు, పప్పు అన్ని ధరలు పెరిగాయి.

– బంగారు పుష్ప, స్థానిక మహిళ

నిత్యావసరాల ధరలు పెరగడంలో దళారుల పాత్ర అధికంగా ఉంటోంది. వారు తలచుకుంటే ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి కూడా. ఇటీవల చక్కెర ధర విపరీతంగా పెరిగిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే చక్కెర ధరలు కిలోకు ఒక్కసారిగా రూ.10 తగ్గిపోయింది. దీనిని బట్టి వారి ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

– బుర్రంశెట్టి బ్రహ్మయ్య, మర్చంట్స్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement