కొత్త ఫ్యాక్టరీ నిర్మించాలి
రైతులను ప్రోత్సహించాలి
● పెదవేగి ప్లాంట్‌లో ఓఈఆర్ తక్కువ
● కాలం చెల్లిన మెషీనరీ కారణం
● నష్టపోతున్న రైతులు
దెందులూరు: మన రాష్ట్రంలో 5.66 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, దాదాపు 1.80 లక్షల మంది రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. ఏటా సుమారు 20 లక్షల టన్నుల గెలల ఉత్పత్తి జరుగుతుండగా, క్రషింగ్ ద్వారా 3.31 లక్షల టన్నుల ముడి పామాయిల్ తయారవుతోంది. ధర ల నిర్ణయంలో ఏపీ ఆయిల్ ఫెడ్ పరిధిలోని పెద వేగి కర్మాగారంలో వచ్చే రికవరీ శాతం (ఓఈఆర్) ప్రామాణికంగా ఉంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అశ్వారావుపేట ప్లాంట్ తెలంగాణకు, పెదవేగి ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌కు చెందాయి. తెలంగాణలో ఆధునిక యూనిట్లు ఏర్పాటై 20 శాతానికి పైగా ఓఈఆర్ వస్తుండగా, పెదవేగిలో పాత యంత్రాల వల్ల సుమారు 16.8 శాతమే వస్తోంది. దీంతోపాటు ప్రైవేట్ ఫ్యాక్టరీలు కొత్త టెక్నాలజీతో అధిక లాభాలు గడిస్తుంటే, పెదవేగి ప్లాంట్‌లో తక్కువ ఓఈఆర్ కారణంగా రైతులు నష్టపోతున్నారు.
ప్లాంట్‌ను ఆధునికీకరించాలి
పెదవేగి కర్మాగారం లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కాలం చెల్లిన మిషనరీ వల్ల ఏటా దాదాపు 65 వేల టన్నుల గెలలను ప్రైవేట్ ఫ్యాక్టరీలకు విక్రయించాల్సి వస్తోంది. ఈ ప్లాంట్‌ను ఆధునీకరించడానికి లేదా కొత్త యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.200 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్‌ఎంఈఓఓపీ) నిధులను సద్వినియోగం చేసుకుని కొత్త కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ కంటే తక్కువ ఓఈఆర్ వస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు తెలంగాణ ఓఈఆర్ ప్రామాణికంగా తాత్కాలిక ధర ఇస్తున్నా, శాశ్వత పరిష్కారంగా ఏపీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఆయిల్‌పామ్ రైతులకు మేలు జరిగి, సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుంది.
ఆదుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఓఈఆర్ ప్రామాణికంగా తీసుకోవడంతో 2014 నుంచి 2019 వరకు తెలంగాణకు ఆంధ్రాకు 2 శాతం తేడా ఉండటంతో ఇక్కడి రైతులు నష్టపోయారు. దీనికి పరిహారం ఇస్తామని చెప్పిన అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెలంగాణ ఓఈఆర్ ప్రామాణికంగా ధర నిర్ణయిస్తూ జీఓ జారీ చేసింది. దీంతో రైతులకు మేలు జరిగింది.
ప్రభుత్వాలు నిధులు కేటాయించి నూతన టెక్నాలజీతో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. ఏపీ ఆయిల్‌ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనను విరమించుకోవాలి.
– చల్లగోళ్ల వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం దెందులూరు నియోజకవర్గ అధ్యక్షుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యిల్‌పామ్ వంటి పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలి. ఓఈఆర్‌కు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసు ఉపసహరించుకోవాలి. పామాయిల్ కంపెనీల దోపిడీపై రైతుల ప్రతిఘటన తప్పదు.
– కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏలూరు


