బుల్లెంపేట సమీపంలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకం
కొయ్యలగూడెం: చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు అక్రమ తవ్వకాలకు గురవుతోంది. మంగపతిదేవిపేట పంచాయతీ పరిధి బుల్లెంపేట సమీపాన కాలువ గట్టును అక్రమార్కులు గ్రావెల్ కోసం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మంగపతిదేవిపేటకి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పొక్లయిన్లతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తరలిస్తునట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో గట్టు 500 మీటర్లకు పైగా కుచించుకుపోయిందని అంటున్నారు. అలాగే రాత్రిళ్లు తవ్వకాలు, తోలకాలతో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. టిప్పర్ గ్రావెల్ రూ.7 వేలకు విక్రయిస్తూ సొ మ్ములు చేసుకుంటున్నారని చెబుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. పొక్లయిన్లు, టిప్పర్ శబ్ధాలకు చేలల్లో కట్టిన పశువులు తెంపుకుని పారిపోతున్నాయని వాపోతున్నారు. అక్రమ తవ్వకాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


