భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి అనే మూడేళ్ల చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించామని సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి పి.విజయలక్ష్మి తెలిపారు. పాప తన పేరు ప్రశాంతి అని, తండ్రి పేరు కిశోర్, తల్లి పేరు దేవి అని, తనకు ఒక తమ్ముడు ఉన్నాడని చెబుతోందని పేర్కొన్నారు. అయితే, ఊరు, ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదన్నారు. ప్రస్తుతం బాలికను సంరక్షణా కేంద్రానికి తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ పాపకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు 89191 58821, 89191 59644 నంబర్లను సంప్రదించాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.


