నిట్‌కు కొత్త డైరెక్టర్‌ వస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

నిట్‌కు కొత్త డైరెక్టర్‌ వస్తున్నారు

Aug 23 2026 12:46 AM | Updated on Aug 23 2026 12:46 AM

అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్న ప్రొఫెసర్‌ కేవీ కృష్ణారావు

ముంబై ఐఐటీలో 30 ఏళ్ల అనుభవం

తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌కు నాలుగేళ్ల తర్వాత కొత్త డైరెక్టర్‌గా ముంబై ఐఐటీలో 30 ఏళ్లుగా సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ కేవీ కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఆయన అక్టోబరులో ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ నిట్‌కు రెగ్యులర్‌ డైరెక్టర్‌ కోసం సుమారు రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చారు. చాలా మంది దరఖాస్తు చేయగా, పరిపాలనా సౌలభ్యం కోసం ఇన్‌చార్జి డైరెక్టర్లను నియమిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్‌ ఎన్‌వీ రమణరావు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. నిట్‌ డైరెక్టర్‌ నియామకానికి సంబంధించి వడపోత కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ, రాష్ట్రపతి విజిటర్‌గా ఉన్న సెలక్షన్‌ కమిటీ మొదట దరఖాస్తు చేసుకున్న వారిలో ఏ ఒక్కరినీ ఎంపిక చేయలేదు. అయితే, ఇదే సెలక్షన్‌ కమిటీలో ఉన్న ఐఐటీలకు చెందిన ఇద్దరు సభ్యులు దేశంలోని నిట్‌లు, ఐఐటీలలో పనిచేస్తున్న ప్రతిభావంతులకు నిట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పించాలని దరఖాస్తులను వేరుగా స్వీకరించారు. ఈ క్రమంలో ముంబై ఐఐటీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం, మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న ప్రొఫెసర్‌ కేవీ కృష్ణారావుకు ఈ అవకాశం దక్కింది.

ప్రస్థానం..

ప్రొఫెసర్‌ కేవీ కృష్ణారావు కాకినాడలోని జేఎన్‌టీయూ నుంచి 1984లో సివిల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. 1986లో మద్రాస్‌ ఐఐటీ నుంచి రవాణా ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌, పట్టణ రవాణా ప్రణాళికలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1996లో ఐఐటీ బాంబేలో చేరిన ఆయన వివిధ కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించారు. స్థిరమైన పట్టణాభివృద్ధి, రవాణా ప్రణాళిక, ప్రయాణ ప్రవర్తన నమూనాలు, ట్రాఫిక్‌ రూపకల్పన, విశ్లేషణ, రహదారి నిర్వహణ తదితర అంశాలపై పరిశోధనలు సాగించారు. పరిశోధన, బోధన రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ఐఐటీ బాంబే ఎక్సలెన్సు ఇన్‌ టీచింగ్‌ అవార్డులను 2008, 2012, 2016 సంవత్సరాల్లో అందుకున్నారు. ఇప్పటివరకు 20 మంది డాక్టరేట్‌ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించగా, వందమందికి పైగా సాంకేతిక విద్యార్థుల పరిశోధనలకు దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రికలు, సదస్సుల్లో ఆయన పరిశోధనలు ప్రచురితమయ్యాయి. భారతదేశానికి అనువైన రహదారి సామర్థ్య ప్రమాణాల రూపకల్పనలోనూ, ముంబై, నవీ ముంబై, పూణే మెట్రోరైలు వ్యవస్థల మాస్టర్‌ ప్లాన్ల తయారీలోనూ, జల రవాణా వ్యవస్థల ప్రణాళికలోనూ ఆయన విశేష సేవలందించారు. ఐఐటీ బాంబేలో పట్టణ శాస్త్రం, ఇంజనీరింగ్‌ కేంద్రం అధిపతిగా, అసోసియేట్‌ డీన్‌గా, డీన్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

కత్తిమీద సామే

ఏపీ నిట్‌కు కొత్త డైరెక్టర్‌గా వస్తున్న ప్రొఫెసర్‌ కేవీ కృష్ణారావుకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సామే కానుంది. తొలి డైరెక్టర్‌ సస్పెండైన తర్వాత ఇక్కడ వ్యవహారాలు పూర్తిగా కొందరు వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోగా, నిట్‌పై కొన్ని అపోహల వల్ల ప్రచారం జరగడం, చివరకు ఇక్కడ ఉన్న సీట్లలో 240 సీట్లు వెనక్కి వెళ్లడానికి దారితీసింది. గతంలో పనిచేసిన సీఎస్‌పీ రావు కొత్త నిట్‌లో శాశ్వత భవనాలు రావడానికి, నిర్మాణాలు పూర్తవ్వడానికి కృషి చేయడంతో పాటు సీట్ల సంఖ్యను 480 నుంచి 720కి పెంచారు. ఈ దశలో కొన్ని అవకతవకలు చోటు చేసుకోవడంతో సీబీఐకి ఫిర్యాదులు వెళ్లగా, 2022 ఫిబ్రవరిలో ఆయనతో పాటు ఆరుగురిపై ఐపీసీ, పీసీ యాక్టుల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2018 మార్చిలో నిట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీఎస్‌పీ రావును 2022 మార్చిలో సస్పెండ్‌ చేశారు. దీనిపై ఆయన అదే ఏడాది సెప్టెంబరులో స్టే తెచ్చుకున్నప్పటికీ విధుల్లోకి చేరలేకపోయారు. ఆయన సస్పెన్షన్‌ తర్వాత ఏపీ నిట్‌ గాడిలో పడకపోవడంతో, ఇప్పుడు రానున్న కొత్త డైరెక్టర్‌పై భారీ బాధ్యతలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement