ముదినేపల్లి (కై కలూరు) : ఆడిట్ అభ్యంతరాలతో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఎఫ్ మొత్తాలను ఆలస్యం చేస్తే సహించేది లేదని పీఎఫ్ పోరాట సమితి ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ముదినేపల్లిలో శనివారం వారు నిరసన తెలిపారు. పోరాట కమిటీ నాయకులు బేతాళ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 46 నెలలుగా ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించిన పీఎఫ్ మొత్తాలను జమ చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో సీఈవో ఖాతాలకు పీఎఫ్ నగదు కోట్ల రూపాయల్లో చేరినప్పుడు రాని అభ్యంతరం, ఇప్పుడు ఆ మొత్తాన్ని మాకు ఇవ్వడానికి వచ్చేసరికి ‘ఆడిట్ అభ్యంతరం’ అని చెప్పడం శోచనీయమన్నారు. కై కలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో 1,066 మంది ఉద్యోగులకు పీఎఫ్ సమస్య ఉందని తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఆడిట్‌లో పీఎఫ్ మొత్తం ఎవరికి జమ చేయాలో అప్పుడే తెలిస్తే సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టేవారని, ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు చెప్పడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు. సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఎఫ్ పోరాట కమిటీ సభ్యులు జాన్సన్ బాబు, జయశ్రీలత, సంధ్య, రామరాజు, నాగేశ్వరరావు, ఎస్టీయూ నాయకులు నాగరాజు, కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు కృపాకర్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


