సిబ్బందిపై పనిభారం
గతమెంతో ఘనం
● పనిచేయని కంప్యూటర్లు
● వేధిస్తున్న సిబ్బంది కొరత
● సేవల్లో జాప్యం
● కూటమి పాలనలో ప్రజలకు తిప్పలు
కై కలూరు: ఒకే చోట ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ప్రారంభమైన సచివాలయాలు నేడు పూర్వ వైభవాన్ని కోల్పోయి వెలవెలబోతున్నాయి. గతంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ వంటి సేవలు గ్రామంలోనే లభించగా, నేడు మళ్లీ చిన్నచిన్న పనుల కోసం మండల కేంద్రాలకు తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వసతుల లేమి.. పనిచేయని కంప్యూటర్లు
గ్రామాల్లో వివిధ రకాల ప్రభుత్వ ధ్రువపత్రాలను వేగంగా అందించడానికి గతంలో ప్రతి సచివాల యానికి రెండు కంప్యూటర్లు, పవర్ బ్యాకప్, ఫర్నిచర్ సమకూర్చారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపంతో అనేక చోట్ల కంప్యూటర్లు మూలన పడ్డాయి. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేక సచివాలయాలకు వచ్చే ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ సేవలు అందగా, నేడు మళ్లీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
తీవ్రమైన సిబ్బంది కొరత : ఉద్యోగుల సర్దుబాటు (రేషనలైజేషన్) కారణంగా సచివాలయాల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది. ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించకపోవడంతో సేవలందించడం భారంగా మారింది. ఉదాహరణకు కై కలూరు నియోజకవర్గంలో 79 సచివాలయాల్లో గతంలో 230 మంది పనిచేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య 150 కన్నా తగ్గింది. శృంగవరప్పాడు సచివాలయ బాధ్యతలను కేవలం ఒకే ఒక్క ఏఎన్‌ఎం చూసుకుంటోంది. కలిదిండి మండలంలోని 20 సచివాలయాలకు గాను మొత్తం మండలంలో ఒకే ఒక్క వ్యవసాయ సహాయకుడు అందుబాటులో ఉన్నారు.
పనులు మానుకుని పడిగాపులు : మహిళా పోలీసులు, వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల కొ ల్లేరు గ్రామ ప్రజలు సర్టిఫికెట్ల కోసం పనులన్నీ వదులుకుని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి సచివాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని గ్రామీణులు కోరుతు న్నారు. కంప్యూటర్ల సమస్యపై కలిదిండి ఎంపీడీఓ కె.రమణబాబును వివరణ కోరితే ఇప్పటికే కంప్యూటర్లు పాడైన సచివాలయాల్లో కొత్తవి అందించామని, సమస్యను పరిశీలిస్తామని చెప్పారు.
కై కలూరు–2 సచివాలయంలో పనిచేయని కంప్యూటర్లు
శృంగవరప్పాడు సచివాలయంలో సిబ్బంది లేని దృశ్యం
సచివాలయాల్లో ఏడుగురు పనిచేయాల్సిన చోట కేవలం ఒక్కరూ మాత్రమే ఉంటున్నారు. ప్రధానంగా డిజిటల్ అసిస్టెంట్లపై భారం పడుతోంది. కలిదిండి మండలంలో పలు సచివాలయాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే సిబ్బందిని భర్తీ చేయాలి.
– ఎస్.మహంకాళిరావు, సీపీఎం కార్యదర్శి, మండవల్లి మండలం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సచివాలయాలు పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా సేవలు అందించాయి. సచివాలయంలో సర్వే అసిస్టెంట్లను ఏర్పాటుచేశారు. నేడు సిబ్బంది కొరత కనిపిస్తోంది. సచివాలయాలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి.
– బలే నాగరాజు, చింతపాడు, మండవల్లి మండలం


