బ్రాంచ్ కంటే నైపుణ్యమే ముఖ్యం
ఇంజనీరింగ్ సీట్లు ఇలా..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇంజనీరింగ్ చదువు వేలాది మంది విద్యార్థుల కల. సాంకేతిక విద్యపై మక్కువతో పాటు కోర్సు పూర్తయితే కొలువులు సులభంగా సాధించవచ్చనే ఆశతో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు బీటెక్ వైపు అడుగులు వేస్తుంటారు. ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో ర్యాంకు లు సాధించిన విద్యార్థులు, త్వరలో ప్రారంభం కా నున్న కౌనర్సెలింగ్ నేపథ్యంలో ఏ బ్రాంచ్ ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఉద్యోగావకాశాలు, భా రీ ప్యాకేజీలు అందించే కోర్సుల గురించి నిపుణులు, సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఇంజనీరింగ్ కోర్సులు, వాటి ప్రాధాన్యతలను పరిశీలిస్తే..
కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
● డిమాండ్ : క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో ఐటీ కంపెనీలు మొదటగా సీఎస్‌ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
● ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : రానున్నది కృత్రిమ మేధ శకం కావడంతో విద్యార్థులు ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి.
● పాఠ్యాంశాలు : కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్/హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా బేస్ వంటి అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
● ద్వితీయ ప్రాధాన్యం : విద్యార్థుల రెండో చాయిస్‌గా ఈసీఈ నిలుస్తోంది.
● ద్వంద్వ ప్రయోజనం: ఈ బ్రాంచ్ చదవడం వల్ల అటు కోర్ (హార్డ్‌వేర్) రంగంతో పాటు ఇటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చు.
● పాఠ్యాంశాలు : శాటిలైట్ కమ్యూనికేషన్స్, మై క్రో ప్రాసెసర్స్, సర్క్యూట్స్, యాంటెన్నా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
● భారీ ఉద్యోగావకాశాలు: ప్రైవేట్ రంగంలో వస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్టుల కారణంగా రా బోయే నాలుగేళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
● ప్రయోజనం : విద్యార్థులకు అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్ రెండింటిపైనా పట్టు లభిస్తుంది.
మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్
మెకానికల్ (ఎవర్‌గ్రీన్ బ్రాంచ్): ద్విచక్ర వాహనాల నుంచి విమానాలు, ఆటోమొబైల్స్, భారీ యంత్రాల రూపకల్పన వరకు మెకానికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం.
కెమికల్ ఇంజనీరింగ్ : డీఎన్‌ఏ సీక్వెన్సింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి ఆధునిక మార్పుల వల్ల ఈ కోర్సుకూ మంచి భవిష్యత్తు ఉంది.
ఏలూరులో ఏపీఈఏపీసెట్‌కు హాజరైన విద్యార్థులు (ఫైల్)
ఊరిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు
పట్టుసాధిస్తే ముంగిటకే ఉద్యోగం
కృత్రిమ మేధ పిలుస్తోంది
బ్రాంచ్ కన్నా నైపుణ్యాలే కీలకం
ఉమ్మడి జిల్లాలో 8,350 సీట్లు
ఏఐ రావడంతో కంప్యూటర్ సైన్స్‌కు ఉద్యోగావకాశాలు ఉండవనే అపోహ సరైంది కాదు. ఆధునిక నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ బ్రాంచ్ విద్యార్థులకు కూడా విస్తృత అవకాశాలు లభిస్తాయి. బ్రాంచ్ ఎన్నిక కీలకమే కానీ ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌లో నైపుణ్యం సాధిస్తేనే అవకాశాలు వస్తాయి. కళాశాలల ఎంపిక కేవలం దానికి ఉన్న పేరు, చేస్తున్న ప్రచారం ఆధారంగా ఉండకూడదు. నాక్, ఎన్‌బీఏ గుర్తింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
– డాక్టర్ మార్లపల్లి కృష్ణ, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఎస్‌ఈ ప్రొఫెసర్
ఏలూరు జిల్లా పరిధిలో 4 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200, రా మచంద్ర కళాశాలలో 1,020, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 330 సీట్లు మొత్తంగా 3,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏలూరు జిల్లా నుంచి 3,816 మంది పరీక్ష రాయగా, 2,766 మంది ఇంజనీరింగ్‌కు అర్హత సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9 కాలేజీల్లో 5,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలో 11,287 మంది పరీక్షలు రాయగా.. 8,212 మంది అర్హత సాధించారు. అయితే, ఇతర జిల్లాల టాపర్లు ఉమ్మడి జిల్లాలోని కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం వల్ల స్థానిక విద్యార్థుల మధ్య సీట్ల కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.


