ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభలు ఏలూరులో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం పూర్వ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యువతను భాగస్వాములను చేస్తూ గ్రామస్థాయి నుంచి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కేవలం ప్రచారానికే పరిమితమైందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల పేరుతో సేకరించిన భూముల్లో నేటికీ పరిశ్రమలు నెలకొల్పలేదని, రైతులకు పరిహారం కూడా చెల్లించలేదని విమర్శించారు. ఆరు నెలల్లో పరిశ్రమలు పెట్టకుంటే ఆ భూ ములను తిరిగి సాగులోకి తెస్తామని హెచ్చరించారు. సహకార రంగంలోని చక్కెర, పాల, స్పిన్నింగ్ మిల్లుల మూతకు పాలకుల విధానాలే కారణ మన్నారు. సోలార్ విద్యుత్ పేరిట కార్పొరేట్ సంస్థలు లబ్ధి పొందుతుంటే, రైతులు రూ.2.40 లక్షల కోట్లు నష్టపోయారని తెలిపారు. పొగాకు రైతులకు మద్దతు ధర ఇస్తామన్న హామీ నెరవేరలేదని, నదీ అనుసంధానం వెనుక పారిశ్రామిక ప్రయోజనాలు ఉన్నాయని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సర్వే వెనుక కార్పొరేట్, మైనార్టీ వ్యతిరేక కుట్ర దాగి ఉందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వై.కేశవరావు, మార్రాపు సూర్యనారాయణ, కె.శ్రీనివాస్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 500 మంది రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.


