● చింతలపూడి వద్ద రెండు లారీలు స్వాధీనం
● తెలంగాణకు అక్రమ రవాణా
చింతలపూడి: తెల్లవారక ముందే రోడ్లెక్కితే చాలు.. గోదావరి బంగారం సరిహద్దులు దాటిపోతోంది. ఏపీలో దొరికే నాణ్యమైన గోదావరి ఇసుకను పొరుగు రాష్ట్రంలో భారీ ధరలకు విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న గోదావరి ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు.
వాహన తనిఖీల్లో దొరికిన లారీలు
చింతలపూడి ఎస్సై కే.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొవ్వూరు పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఇసుక లోడుతో తెలంగాణ వైపు దూసుకుపోతున్న రెండు లారీలను పోలీసులు అడ్డుకున్నారు. వీటికి సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో సదరు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాహనాలను చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణకు తరలించారు. ఇసుక అక్రమ దందాపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సతీష్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
సరిహద్దు గ్రామాల్లో డంపింగ్ యార్డులు
కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది టన్నుల గోదావరి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇందుకు తెలంగాణ సరిహద్దుల్లోని ఏపీ గ్రామాలే ప్రధాన కేంద్రాలుగా మారుతుండటం గమనార్హం. గురుబట్లగూడెం, మేడిశెట్టివారిపాలెం, మల్లేశ్వరం, ఎండపల్లి, అల్లిపల్లి గ్రామాల్లో పగటిపూట రహస్యంగా ఇసుకను భారీ ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. చీకటి పడగానే తెలంగాణలోని పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకు లారీల ద్వారా తరలిస్తూ, అక్కడ డిమాండ్‌ను బట్టి భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జరిమానాలు విధిస్తున్నా.. తగ్గని జోరు!
గతంలో పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. ఇసుక ప్రతిరోజూ సరిహద్దులు దాటుతూనే ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత నిఘా పెంచాలని, ఇసుక మాఫియాపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


