ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన రైతు పల్లి సుబ్బారెడ్డి సాగు చేస్తున్న పీఎండీఎస్ ఫీల్డ్ వరి పంటను కెన్యా దేశానికి చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతు అనుసరిస్తున్న సాగు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నిర్వహణ, జీవామృతం, ఘనజీవామృతం వినియోగం, తెగుళ్ల నివారణ, ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు వంటి వివరాలను రైతుతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యత గల దిగుబడులు సాధిస్తున్న తీరును కెన్యా ప్రతినిధులు అభినందించారు. రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్, ఏడీపీఎం వల్లీ, తదితరులు పాల్గొన్నారు.


