తణుకులో రేషన్‌ దందా | - | Sakshi
Sakshi News home page

తణుకులో రేషన్‌ దందా

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

తణుకు అర్బన్‌: తణుకులో చౌక డిపోల రేషన్‌ దందా జోరుగా సాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్‌ డీలర్లు బొక్కేస్తున్నారు. 1వ తేదీ నుంచి రేషన్‌ డిపోల్లో బియ్యం, పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని డిపోలు తెరవకపోవడం, కొన్ని డిపోల్లో అవకతవకల నేపథ్యంలో తలెత్తిన ఫిర్యాదుల మేరకు తణుకులో నిర్వహించిన విజిలెన్స్‌ దాడులు సంచలనం రేకెత్తించాయి. తణుకులో ఈ నెల 2, 3 తేదీల్లో జరిపిన విజిలెన్స్‌ దాడుల్లో భాగంగా ముందుగా దుకాణ షట్టర్లు తెరవకుండా సీల్‌ వేశారు. అనంతరం పూర్తిస్థాయి అధికారుల తనిఖీల్లో 12, 21, 35, 49 డిపోల్లో సరుకుల్లో అవకతవకలు గుర్తించి ఆ దుకాణాలను సీజ్‌ చేసి 6 ఏ కేసులు నమోదు చేశారు. ఇంతవరకు బియ్యం బదులుగా డబ్బులు ఇవ్వడం, తక్కువ తూకం తూచడం లేదా లబ్ధిదారుడి బయోమెట్రిక్‌ వేయించుకుని బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టడం చూశాం కానీ తణుకులో మాత్రం ఏకంగా దించిన బియ్యం బస్తాలను నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేసి క్యాష్‌ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వివాదాస్పదంగా 21వ నంబరు డిపో

వివాదాస్పదంగా మారిన 21వ నంబరు డిపోలో ఈ నెల 1వ తేదీ నుంచి సరుకులు ఇవ్వాల్సి ఉండగా తణుకు ఇరగవరం కాలనీలోని మొఖమట్ల ఉమాదేవి పేరుతో ఉన్న డిపోను ఆ రోజు కొంతసేపు తెరచి తరువాత మూసివేశారు. 2వ తేదీన పూర్తిగా తెరవకపోవడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌, తణుకు రెవెన్యూ అధికారులు దుకాణం తెరవకుండా ముందుగా సీల్‌ వేశారు. 3వ తేదీన విజిలెన్స్‌ అధికారులు షట్టర్‌ తెరచి చూడగా ఒక్క బియ్యం బస్తా కూడా కనిపించకపోవడంతో విస్తుపోయారు. రికార్డుల ప్రకారం 9,690 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా, 8,790 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం రెండో రోజుకే బియ్యం బస్తాలు మాయం కావడంపై ఆరా తీస్తే, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి దించుకున్న బియ్యం బస్తాలను వెంటనే బ్లాక్‌ మార్కెట్‌కు తరలించారని తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తణుకులో కొన్ని రేషన్‌ డిపోల్లో డీలర్లను మార్చి తమ వారికి కట్టబెట్టారు. ఇదే అదనుగా కొందరు రేషన్‌ డిపోలను తమ ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీకి దిగుతున్నారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో తణుకు పాతవూరులోని 23వ నంబరు డిపో కూడా ఇదే తరహాలో డిపో తెరవకుండా ఉండటం, లబ్ధిదారుల ఫిర్యాదుతో అధికారుల రంగప్రవేశంతో 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార, సుమారుగా రూ.6 లక్షల విలువైన సరుకులు మాయం చేసినట్లు తేలింది. ఈ వ్యవహారం నిరూపణ కావడంతో సదరు రేషన్‌ డీలరుపై రెవెన్యూ అధికారులు 6 ఏ కేసు నమోదు చేశారు. తాజాగా 21వ నంబరు రేషన్‌ డిపోలో సైతం సుమారుగా రూ.5 లక్షల విలువైన 8,790 కిలోల బియ్యం మాయం చేయడం వివాదాస్పదంగా మారింది.

రేషన్‌ డిపోల బియ్యం నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement