పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

పెదవేగి: పంటలకు వాడే క్రిమి సంహారక మందుల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పంటలపై మందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయ అధికారులు, డివిజనల్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు పలు సూచనలు చేశారు.

పిచికారీ సమయంలో జాగ్రత్తలు

● మందులు పిచికారీ చేసే సమయంలో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి.

● పిచికారీ చేసే సమయంలో పొగ తాగడం, నీరు తాగడం లేదా భోజనం చేయడం చేయరాదు.

● పిచికారీ కోసం వాడే స్ప్రేయర్లు మంచి స్థితిలో ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలి. నాజిల్స్‌ను శుభ్రం చేయడానికి నోటితో గాలి ఊదరాదు.

● పురుగు, తెగుళ్ల మందులను కలిపేటప్పుడు చేతులతో కాకుండా కర్రతో కలపాలి.

● మందులను ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయరాదు. పురుగు మందుల డబ్బాలను పిల్లలకు అందకుండా ప్రత్యేక గదిలో తాళం వేసి భద్రపరచాలి.

● మందులు వాడే ముందు వాటిపై ఉన్న వివరాలు, రంగు ముద్రలను జాగ్రత్తగా పరిశీలించాలి.

● గాలి వీచే దిశను బట్టి మాత్రమే మందును పిచికారీ చేయాలి.

● ఒకవేళ ప్రమాదవశాత్తు మందు కళ్లలో పడితే వెంటనే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. విష ప్రభావానికి గురైతే వెంటనే ప్రథమ చికిత్స అందించి, డాక్టర్‌ను సంప్రదించాలి.

● పిచికారీ పూర్తయిన వెంటనే స్నానం చేసి, దుస్తులను శుభ్రపరచుకోవాలి. స్ప్రేయర్లను శుభ్రంగా కడిగి, ఇంజన్‌ ఆయిల్‌ రాసి జాగ్రత్త పరచాలి.

● ఖాళీ అయిన మందుల డబ్బాలను భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. వాటిని ఇతర అవసరాలకు వాడకూడదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement