నూజివీడు: పట్టణంలోని ఆక్రమణలపై సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి బొల్లపల్లి వినూత్న కఠిన చర్యలు చేపట్టారు. మైలవరం రోడ్డులోని ముసలి రామమందిరం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ఉన్న దుకాణదారులు డ్రెయినేజీలపై కౌంటర్లు, షోకేస్‌లు, వస్తువులు ఏర్పాటు చేయడంపై ఆమె మండిపడ్డారు. దీనివల్ల వాహనాలు నిలపడానికి స్థలం లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాపారాలన్నీ షట్టర్ల లోపలే జరగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కొరపాటి పీరయ్యను ఆదేశించారు. అలాగే డ్రెయినేజీలపై ఉన్న నూడిల్స్ బండ్లు, టిఫిన్ బండ్లు, కొబ్బరిబోండాల దుకాణాలు, టీస్టాళ్లను వెంటనే తొలగించి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. పట్టణంలోని అన్ని రోడ్లలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో సబ్ కలెక్టర్‌తో పాటు కమిషనర్, టీపీఓ కె.వెంకటేశ్వరరావు, టౌన్ ఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు.


