ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో జిల్లాను అభివృద్ధిలో 5 నుంచి 3వ స్థానంలో నిలిపామన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలపై చర్చించామన్నారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, పంచాయతీ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర అంశాలపై చర్చించామన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’ అభివృద్ధి చేస్తున్నామన్నారు. వంట గ్యాస్ కొరత లేదని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 20న విశాఖపట్టణం పోర్ట్‌కు వంట గ్యాస్ నౌక చేరుకుంటుందన్నారు. ఆహార పదార్థాలు కల్తీలపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న 59 ఫుడ్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.


