బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ | - | Sakshi
Sakshi News home page

బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ

బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ

బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ అధిక ఫీజుల వసూలుపై ఫిర్యాదు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు 3,917 మంది హాజరు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి రూ.25 కోట్లతో గ్రంథాలయ బడ్జెట్‌ ప్రతిపాదన

బుట్టాయగూడెం : బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకుడు, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌ తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎంపీటీసీలకు 12 మంది హాజరయ్యారని చెప్పారు. కోరం పూర్తి కావడంతో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం పూర్తి చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులు పంపిస్తామన్నారు. అలాగే ఎంపీపీగా ఎన్నికై న తెల్లం రమణకు ఎన్నిక ఫాంను జేసీ, ఆర్‌డీఓ చేతుల మీదుగా అందజేశారు.

ఏలూరు (టూటౌన్‌): విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు పూర్తికాకుండానే ఏలూరు జిల్లాలో కొన్ని ప్రవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్‌న్లు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అధిక ఫీజులు వసూలు చేయడానికి సిద్దమవుతున్నాయని ఏఐఎస్‌ఎఫ్‌ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివ కుమార్‌ అన్నారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని స్ఫూర్తి భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విద్యాసంస్థలకు అసలు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకుండా అడ్మిషన్‌న్లు చేస్తుంటే కనీసం విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోడం చాలా బాధాకరమన్నారు. గుర్లింపు లేని విద్యాసంస్థలను సీజ్‌ చేయాలన్నారు. ఫీజుల వసూళ్లపైనా జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు వినతిపత్రాలు అందించినా ఏ మాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోరాటాలకు పిలుపు నిస్తామని హెచ్చరించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని 47 కేంద్రాల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షలకు 3,917 మంది హాజరయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు జరిగిన ఈ పరీక్షల్లో ఉదయం 1,859 మందికి 1,820 మంది హాజరు కాగా 39 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2,143 మందికి 2,097 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులూ నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాను ఒక ప్రకటనలో తెలిపారు.

నూజివీడు: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్‌ చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌లో శానిటేషన్‌ కార్మికులు బుధవారం పాంప్లెట్‌లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ మోదీ సర్కార్‌ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిందని, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఈ ఫిబ్రవరి 12న చేపట్టే సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సమావేశంలో 2026– 2027 సంవత్సరానికి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి తదితర పనులకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుడికి పంపడానికి తీర్మానించి ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్‌ జుత్తుగ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌ బాబు, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడు జీసీహెచ్‌ ప్రభాకర్‌, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఆర్‌.విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement