‘మార్పు’ అమలుపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో నాటుసారా తయారీ నుంచి బయటకు వచ్చిన కుటుంబాలకు ‘మార్పు’ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామని, ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నవోదయం–2 లో మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ మానేసి, ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు అంగీకరించిన 26 కుటుంబాలకు రూ.19 లక్షలు కలెక్టర్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, సొంగా రోషన్‌కుమార్‌లు అందించారు.
తొలి విడత అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం
ఏలూరు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పాత్రికేయుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్‌లు మంజూరు చేశామని కలెక్టర్ చెప్పారు. బుధవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి రెండో సమావేశంలో మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించగా, పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


