శివరాత్రికి చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం శివక్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. లక్షన్నరకు పైగా భక్తులు హాజరవుతారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో భక్తులు నడిచి వెళ్లేందుకు వీలుగా పంట్లు ఏర్పాటు చేసి క్షేత్రం వైపు ఇసుకతో ర్యాంపు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇసుక తిన్నెలపై చలువ పందిళ్ళ నిర్మాణం చేపట్టారు. వాహనాలు పార్కింగ్ ప్లేస్‌లు, తాత్కాలిక బస్టాండ్‌ల ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది వరద ప్రవాహం మారడంతో నది మధ్యలో రెండు పాయలుగా ఏర్పడింది. దీంతో నడిచి వెళ్లి వచ్చేందుకు మార్గం దూరమైంది. ఇసుక తిన్నెలపై తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా కర్రలు, తాటాకులతో నిర్మాణాలు చేపట్టారు. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్‌లు, బారికేడ్ల పనులు చేస్తున్నారు.
ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్న చలువ పందిళ్లు


