11 నుంచి బాస్కెట్‌బాల్ పోటీలు
● నూజివీడులో జాతీయ స్థాయి టోర్నమెంట్
● తలపడనున్న 49 జట్లు
నూజివీడు: సంక్రాంతి సందర్భంగా పట్టణంలో డీఏఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న శ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహూద్దూర్ మెమోరియల్ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు కనువిందు చేయనున్నాయి. గత 48 ఏళ్లుగా సంక్రాంతికి బాస్కెట్‌బాల్ పోటీలు నిరాటంకంగా జరుగుతున్నాయి. పురుషులు, మహిళల విభాగంలో జరిగే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 49 జట్లు తమ ఎంట్రీలను నమోదు చేసుకున్నాయి. పురుషుల విభాగంలో 35 జట్లు, మహిళల విభాగంలో 14 జట్లు రానున్నాయి. పోటీల నిర్వహణకు బాస్కెట్‌బాల్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 20 మంది రిఫరీలు రానున్నారు. స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు, క్రీడామానులు తదితరుల నుంచి అందే విరాళాలతో బాస్కెట్‌బాల్ పోటీలను అంతరాయం లేకుండా నిర్వహిస్తున్నారు. లీగ్‌కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలను నిర్వహించడానికి కళాశాల ప్రాంగణంలోని రెండు బాస్కెట్‌బాల్ కోర్టులను సిద్ధం చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా పోటీలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.
మాజీ రాజ్యసభ్యుడైన స్వర్గీయ ఎమ్మార్ అప్పారావు అధ్యక్షుడిగా, ఎంఎస్ అప్పారావు కార్యదర్శిగా 1969లో మొట్టమొదటిసారిగా నూజివీడు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆవిర్భవించింది. అనంతరం 1971లో డీఏఆర్ కళాశాల్లో ఆంధ్రా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 1973లో ఎంఎస్ అప్పారావు సారథ్యంలో బాస్కెట్‌బాల్ సంఘం ఏర్పాటైంది. 1975లో చిత్తూరులో జరిగిన ఆంధ్రా చాంపియన్‌షిప్ పోటీల్లో పురుషుల, మహిళ విభాగాల్లో నూజివీడు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. 1976 నుంచి నూజివీడులో బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. క్రీడను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మార్ అప్పారావు నేతృత్వంలో నూజివీడు కేంద్రంగా జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటైంది. డీఏఆర్ కళాశాల్లో అప్పట్లో బాస్కెట్‌బాల్ శిక్షణ నిర్వహించేరు. ఈ శిక్షణలో నూజివీడు ప్రాంతానికి చెందిన వారు బాస్కెట్‌బాల్ నేర్చుకొని జాతీయ స్థాయి పోటీల్లో తమ సత్తా చాటి నూజివీడుకు మంచి గుర్తింపు తెచ్చారు.


