రహదారి భద్రతా నియమాలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: ప్రమాదాల నివారణకు రహదా రి భద్రత ఆవశ్యకతను తెలియజేసేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో స్పెషల్ డ్రైవ్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండని పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాల్లో యువత ఎక్కువగా మరణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. హెల్మెట్ ధరించడంతో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన పత్రాలు లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రుల పైనా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాంతకమన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్లు లేనటువంటి వారు, హెల్మెట్లు ధరించినటువంటి వారిపై జరిమానాలతో వదలకుండా, వాహనదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించి, అప్పటికప్పుడే నంబర్ ప్లేట్లను అమర్చుకునేలాగా చర్యలు తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై ఎం.కుటుంబరావు, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


