15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
నూజివీడు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరింది. క్యాంపస్‌లోని ఐ3 భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన టెంట్‌లో దీక్ష నిర్వహిస్తున్నారు. వీరందరూ తమ క్లాసులకు వెళ్లి టైంటేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించి తదనంతరం పోరాట దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏడేళ్లకు పైగా తమకు వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని, దీనిపై తాము గత 15రోజులుగా పోరాడుతున్నా ఆర్జీయూకేటీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూజీసీ ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పి, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ సుబ్బారావు, రచన గోస్వామి, పీవీ లక్ష్మణరావు, జాడ సీతాపతిరావు, లంకపల్లి రాజేష్, భవాని, ఉదయశ్రీ, దీప్తీ సాహూ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీని, టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగరాజు తెలిపారు. యర్రంపేట సమీపంలోని పులపాల చెరువులో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి లారీల్లో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పీడబ్ల్యూడీ ఏఈ ఎంఆర్ భాస్కర్‌తో కలిసి దాడి చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఈ సమయంలో జేసీబీ, ఒక టిప్పర్ లారీని పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు తెలిపారు.
పోలవరం రూరల్: పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకై జిల్లా సాధనా సమితి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం 9వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరంలో మహిళలు దీక్ష చేపట్టారు. జిల్లా ఏర్పాటు చేయాలంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా ఏటిగట్టు సెంటర్‌లో సాధనా సమితి సభ్యులు పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినదించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధనా సమతి నాయకులు సొబ్బన మోహన్, బుగ్గా మురళీకృష్ణ, కోటంరాజు రాంబాబు, జేవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (మెట్రో): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ప్రకృతి వ్యవసాయం డీపీఎం బి.వెంకటేష్ అన్నారు. స్థానిక ఏలూరు జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని ఐడీపీ హాల్‌లో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందులతో పండించిన ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, సాధ్యమైనంత వరకు అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యతకను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను సత్కరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీఏ, ఏలూరు, పెదపాడు ఏవోలు, సెర్ప్ సిబ్బంది, ఏలూరు మండల ఏపీఎం, రైతులు పాల్గొన్నారు.
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష


