అడిగేదెవరు.. ఆపేదెవరు?
ద్వారకాతిరుమల: ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు సంపాదించుకుంటాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన గ్రావెల్ మట్టిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలంలోని పలు చెరువులు, పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం పొక్లెయిన్లతో యథేచ్ఛగా గ్రావెల్ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొడుతున్నారు. నిబంధనలకు పాతర వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చినప్పుడు మాత్రమే కథ పోలీస్టేషన్‌కు చేరుతోంది.
చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. గ్రావెల్ మట్టి మాఫియా చెరువులు, పోలవరం కుడి కాలువ గట్లపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. ముఖ్యంగా గుణ్ణంపల్లి–ఎం.నాగుపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం పెద్ద పెద్ద అగాథాలను తలపిస్తోంది. అలాగే పలు చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, గోతులు పెడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి పశువులు, రైతులు అందులో పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
పంపకాలు తేడా వచ్చినప్పుడే..
కొందరు పచ్చనేతలు సిండికేట్‌గా ఏర్పడి ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. సాధారణంగా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. అయితే అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చి, అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు రంగప్రవేశం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రజలు మండిపడుతున్నారు. సేవ చేస్తారని కూటమికి అధికారం కట్టబెడితే.. దోచుకు తింటున్నారని ధ్వజమెత్తుతున్నారు.
తూతూమంత్రంగా ఫైన్లు
సత్తాల పంచాయతీ సండ్రకుంటకు చెందిన ఓ నాయకుడు గతంలో సత్తాల చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, పెద్దపెద్ద గోతులు పెట్టాడు. రెండు మూడు సార్లు పోలీసులు చిక్కినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి సైతం ఆ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, మట్టిని తరలిస్తూ పోలీసులకు పట్టబడడంతో అతడి టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేయకుండా మైన్స్ అధికారులకు అప్పగిస్తుండడం, అక్కడి అధికారులు తూతూమంత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తుండటం వల్ల ఇలాంటి నాయకులకు భయం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తూ.. అధికార పార్టీ వారిని మైన్స్ అధికారులకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మట్టి తవ్వకాలు ఎక్కడంటే..
● తిరుమలంపాలెంకు చెందిన ఓ నాయకుడు ఎటువంటి అనుమతులు లేకుండా సూర్యచంద్రరావుపేటలోని కృష్ణాపురం చెరువు, గొల్లగూడెంలోని దొర చెరువు, తిరుమలంపాలెంలోని నారప్ప చెరువులో మట్టిని తవ్వి తిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపానికి తరలిస్తున్నాడు.
● పి.కన్నాపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్ మట్టిని దూబచర్లకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు. మొత్తం కాంట్రాక్టు 500 టిప్పర్ల మట్టికి కాగా, రోజుకు 50 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నాడు.
● జి.కొత్తపల్లిలో ఓ నాయకుడు రైతుల పొలాల్లో గ్రావెల్‌ను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వి, చుట్టు పక్కల ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు.
● తక్కెళ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుడు గుణ్ణంపల్లి ప్రాంతంలోని పోలవరం కుడికాలువ–తాడిపూడి కాలువ గట్ల మధ్యలో ఉన్న ఖాళీ భూమిలో ఈ తవ్వకాలు జరుపుతున్నాడు. ఇప్పటికే కాలువకన్నా ఎక్కువ లోతు తవ్వకాలు జరిపాడు. భవిష్యత్తులో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
● ఐఎస్.జగన్నాధపురంలో ఓ నాయకుడు ఎర్ర చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి ఇటుక బట్టీలకు, ఖాళీ స్థలాలను మెరక చేసేందుకు తరలిస్తున్నాడు.
రెచ్చిపోతున్న టీడీపీ నేతల మట్టి మాఫియా
కాలువ గట్లు, చెరువుల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలింపు
మా రాజ్యం.. మా ఇష్టం అంటూ నేతల బెదిరింపులు
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం
అడిగేదెవరు.. ఆపేదెవరు?
అడిగేదెవరు.. ఆపేదెవరు?
అడిగేదెవరు.. ఆపేదెవరు?


