యథేచ్ఛగా కోళ్ల వ్యర్థాల తరలింపు
ఆగిరిపల్లి: మండలంలో ఇష్టానుసారంగా చేపల చెరువుల కోసం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆగిరిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో పదుల సంఖ్యలో మాంసం దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు చికెన్ దుకాణాల వద్ద నుంచి చేపల చెరువుల నిమిత్తం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఉదయం పూట జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కోళ్ల వ్యర్థాల తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెం: భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన గంజి వనజకు జోషిబాబుతో 2024 జనవరిలో గన్నవరంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 6 కాసుల బంగారం, చీర సారె కింద రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసైన జోషిబాబు వివాహం అయిన కొద్దిరోజుల నుంచి భార్య వనజను శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనికి అతని కుటుంబసభ్యులు ఆరుగురు సహకరిస్తున్నట్లు బాధితురాలు వనజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
వీరవాసరం: శ్రీ కొల్లా భాస్కరమ్మ, శ్రీ గుండా లక్ష్మీ రత్నావతి మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్, క్రికెట్ పోటీలు బుధవారం వీరవాసరంలో ప్రారంభమయ్యాయి. నరసాపురం– నెల్లూరు జట్ల మధ్య, వీరవాసరం– బుట్టాయగూడెం, కొవ్వూరు– జంగారెడ్డిగూడెం జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి పోటీలను తిలకించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా జయ ప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, గుండా రామకృష్ణ, కారింశెట్టి మూర్తి, బాజీంకి గంగా మహేష్, పీఎన్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


