గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్
● ప్రమాదం అంచున ఐదు గ్రామాల సాగు, తాగునీటి సరఫరా
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సర్పంచ్, గ్రామస్తులు
దెందులూరు: గోదావరి కాలువ పక్కన ఉండ్రాజవరం వంతెన వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం నిలుపుదల చేయాలని పోతునూరు గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను, గ్రామస్తులు కలిసి జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్ పెడితే పోతునూరు, కొవ్వలి, సత్యనారాయణపురం, దెందులూరుతో పాటు ఏలూరు గ్రామాలకు సాగు, తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఎన్నడూ గోదావరి కాల్వ పక్కన డంపింగ్ యార్డ్ నిర్మాణం జరగలేదన్నారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్, డీపీఓను విచారణ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను విలేకరులతో మాట్లాడుతూ తాము డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గోదావరి కాలువ పక్కన ఎవరైనా డంపింగ్ యార్డ్ పెడతారా అని ప్రశ్నించారు.


