అవును.. ఇది పంట కాలువే!
ఉండి: నిండా గుర్రపుడెక్క, తూడుతో నిండి అర్తమూరు వెళ్లే పంట కాలువ అ ధ్వానంగా మారింది. ఒక వైపు గట్లు లేకపోవడంతో పల్లపు ప్రాంతాలకు నీరు వెళ్లిపోతోంది. దీంతో రైతులు సాగునీరు అందక అల్లాడుతున్నారు. ఎగువ ప్రాంతాలకు నీరు కావాలంటే రైతులు ఇంజిన్ల సాయంతో తోడుకోవాల్సిన పరిస్థితి. ఒక వైపు గట్టు లేకపోవడం, మరో వైపు తూడు, చెత్తతో నిండిపోవడంతో పాటు పూర్తిస్థాయిలో పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతోపాటు నీటి ప్రవాహం మందగించి పసర్లతో నిండిపోవడంతో అరకొర నీరు కూడా సాగుకు పనికిరావడం లేదని రైతులు అంటున్నారు. ఆక్వా చెరువుల మధ్య నుంచి ప్రవహించే పంట కాలువ కావడంతో నీటి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. రాత్రిళ్లు ఆక్వా వ్యర్థాలను ఈ కాలువలోకి వదులుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ బాగుచేయించాలని కోరుతున్నారు.


