మిర్చికి కొత్త క్రేజ్
లాభసాటి ఆదాయం: విక్రమ్
వేలేరుపాడులో గుంటూరు కారం ఘాటు
వేలేరుపాడు : సాధారణంగా ఎరుపు రంగులో ఉన్న వివిధ రకాల మిర్చిని రైతులు సాగుచేస్తుంటారు. కానీ ఆ యువ రైతు వైరెటీగా ఉంటుందని పసుపు పచ్చ మిర్చీని సాగు చేశాడు. దీంతో ఆ యువ రైతు పంట పండింది. యూట్యూబ్‌లో చూసి, గుంటూరు నుంచి తెప్పించి పచ్చ మిర్చి రకం విత్తనాలు నాటిన ఆ రైతుకు మంచి ఆదాయం వచ్చింది. అరుదుగా పండించే ఈ పసుపు పచ్చ మిర్చికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ఆ రైతు పంట పండింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామానికి చెందిన బుడిపిటి విక్రమ్ అనే యువ రైతు మొత్తం ఐదు ఎకరాల మిర్చి పంట సాగు చేశాడు. ఇందులో పసుపు పచ్చ రకం మిర్చి ఒక ఎకరం సాగు చేయగా, మిగతా నాలుగు ఎకరాల్లో నంబర్ 5 రకం ఎర్ర మిర్చి సాగు చేశాడు. పచ్చ మిర్చికి మంచి డిమాండ్ ఉండడంతో.. యూ ట్యూబ్‌లో చూసిన విక్రమ్ గుంటూరు నుంచి యువీ, నరింగ ఎఫ్–1 హైబ్రేడ్ చిల్లీ విత్తనాలను తెప్పించి ఎకరం సాగు చేశాడు. ఎకరానికి లక్షా 15 వేల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వింటాళ్ళ పసుపు మిర్చి దిగుబడి వచ్చింది. క్వింటా ధర గుంటూరు మార్కెట్‌లో ప్రస్తుతం రూ.40 వేలు పలుకుతుండగా, గత ఏడాది క్వింటా ధర రూ.65 వేల వరకు పలికింది. పసుపు రంగు మిర్చి గుంటూరు మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. దేశ, విదేశాల్లో వివిధ వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఈ మిర్చిని వివిధ కంపెనీలు చిన్న పిల్లలు తినే బింగో, లేస్, తదితర స్నాక్స్‌లో వినియోగిస్తున్నారు, రంగుల తయారీకి కూడా వాడుతున్నారు.
యూట్యూబ్‌లో ఎల్లో రకం మిర్చి సాగు లాభసాటిగా ఉంటుందని చూశాను. ఈ ప్రాంతంలో ఈ రకం ఎవరూ సాగు చేయలేదు. వైరెటీ ఉంటుందని ఎకరం వేశాను. ఎకరాకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెడితే రూ.13 లక్షల వరకు లాభం వచ్చింది. నల్ల రేగడి నేల కావడంతో మంచి దిగుబడి వచ్చింది.
మిర్చికి కొత్త క్రేజ్
మిర్చికి కొత్త క్రేజ్
మిర్చికి కొత్త క్రేజ్


