భక్తుల తిప్పలు.. ఎమ్మెల్యే డప్పులు
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 30న జరిగిన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లన్నీ తానే చేయించానని, భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగలేదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గొప్పలు చెప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆరోజు భక్తులు పడిన ఇబ్బందుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్లజర్ల మండలంలోని ప్రకాశరావుపాలెంలో గత శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతేడాది ముక్కోటి ఏర్పాట్లను తానే దగ్గరుండి పర్యవేక్షించానని, అప్పుడు 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చారని, ఈ సారి రెట్టింపు అవుతుందని అనుమానం కలిగిందన్నారు. అందుకే కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేయించానన్నారు. పెద్ద తిరుపతిలో ముక్కోటి మరుసటి రోజు 64 వేల మంది భక్తులు దర్శిస్తే, ద్వారకాతిరుమలలో ముక్కోటి నాడు 60 వేల మంది భక్తులు దర్శించారన్నారు. ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ, అల్పాహారం ఇవ్వాలని రాత్రి 9 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెంటపడుతూ దేవస్థానం వారికి, పోలీసులకు డైరెక్షన్ ఇచ్చానన్నారు. కనీసం మంచినీరు కూడా అందలేదని, టాయిలెట్స్ లేవని, రూ. 500 లు టికెట్లు తీసుకుని నానా తిప్పలు పడుతున్నామని, ఇప్పటికే 4 గంటల సమయం పట్టిందని, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, అధికారులపై భక్తులు మండిపడ్డారు.
టీడీపీ నాయకుల వల్లే ఫెయిల్
వీఐపీ గేట్ నుంచి, ధ్వజస్తంభం మీదుగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులను మాత్రమే పంపుతామని కలెక్టర్, ఎస్పీలకు వివరించారు. ముక్కోటి నాడు కొందరు టీడీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులను, పార్టీకి చెందిన వారిని ఆ గేటు నుంచి లోపలికి పంపారు. దేవస్థానం అధికారులు గేటు తాళాలను సైతం నాయకులకే అప్పగించినట్టు తెలుస్తోంది. ధ్వజస్తంభం వద్ద రద్దీ పెరిగి, రూ. 500 టికెట్లు తీసుకున్న భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులంతా అష్టకష్టాలు పడ్డారు. వీఐపీ గేటు లోంచి సుమారు 5 వేల మందికి పైగా వెళ్లినట్టు తెలుస్తోంది.
ముక్కోటి ఏర్పాట్లపై గోపాలపురం ఎమ్మెల్యే గొప్పలు
60 వేల మంది శ్రీవారిని దర్శించారని, అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రకటన
ఆ రోజు సౌకర్యాలు అందక ఇబ్బందులు పడ్డ భక్తులు
భక్తుల తిప్పలు.. ఎమ్మెల్యే డప్పులు


