20 కాసుల బంగారం చోరీ
తణుకు అర్బన్: ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ జరిగిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వ సంతమార్కెట్ ప్రాంతంలోని భవనంలో నివసిస్తున్న సింహాద్రి సూర్య భగవాన్ నివాసంలోకి శనివారం రాత్రి దొంగలు ప్రవేశించి 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సూర్యభగవాన్ ఇంటి కింది భాగంలో మందుల దుకాణం, వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. వ్యాపారం ముగిసిన అనంతరం రాత్రి ఒంటిగంటకు తన భార్యతో కలిసి దుకాణం వెనుక ఉన్న బెడ్‌రూమ్‌లో నిద్రించారు. తెల్లవారుజామున 5 గంటలకు మందుల కోసం గ్రామస్తులు తలుపుకొట్టి నిద్రలేపగా మందుల దుకాణంలోకి వెళ్లాడు. క్యాష్ పెట్టె చిందరగా ఉండడంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది. చూడగా బంగారు ఆభరణాలు లేవని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చి తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. చోరీ ఘటనలో దువ్వ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చోరీ జరిగిన ఇంటిని తాడేపల్లిగూడెం డీఎస్పీ కె.విశ్వనాఽథ్ పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీం ఇంటి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దువ్వలో ప్రధానమైన సంతమార్కెట్ ప్రాంతం ఎంతో రద్దీగా ఉంటుంది. ఎటుచూసినా ఇళ్లు ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడి చోరీ చేసి తీరు అనుమానాస్పదంగా మారింది. బంగారు ఆభరణాలు ఉన్న ప్రాంతంలోనే ఉన్న రూ.10ల నోట్ల కట్టలు తీసుకోకపోవడం గమనార్హం. బీరువాలో ఉన్న బ్యాంకు పుస్తకాలు ఇతర కాగితాలను సందులో గోడపై వదిలివెళ్లారు. రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
20 కాసుల బంగారం చోరీ


