మాతా శిశు మరణాలు నివారించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో మాతాశిశు మరణాలను నివారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మాతాశిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలో గతేడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో మాతృ మరణాలు ఒకటి, శిశు మరణాలు 47 నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మాతాశిశు మరణాలు జీరో శాతం ఉండేలా కృషి చేయాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసూతి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరివరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుంచే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ దిశగా మహిళలకు అవగాహన కల్పించాలని వైద్యులను ఆదేశించారు. గర్భిణులు, రోగులకు సేవాభావంతో ఉన్నతమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. స్కానింగ్ చేసినప్పుడు శిశువుకు ఇబ్బందులు ఉంటే ముందుగానే వైద్యసేవలు అందించాలన్నారు. తల్లి పాలిచ్చే విధానం, ఆరోగ్య గుణాలపై బాలింతలకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. జిల్లా ప్రధాన హాస్పిటల్‌లో పూర్తిస్థాయిలో పరికరాలకు నివేదిక అందించాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు. డీఎంహెచ్‌ఓ పీజే అమృతం, డీసీహెచ్‌ఎస్ బి.పాల్ సతీష్‌కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి యు.శోభ, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డాక్టర్లు పాల్గొన్నారు.


