శ్రీవారి దేవస్థానం ఈఓగా భద్రాజీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఉప కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్న వై.భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియడంతో భద్రాజీకి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కుకునూరు, వేలేరు లోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. కుకునూరులో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, వేలేరులో ఏఎన్‌ఎం పోస్టులు ఉన్నాయని, సంబంధిత మండలాలకు చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఏలూరులోని తన కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు.
నూజివీడు: ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకట రామారావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీవీ లక్ష్మణరావు, సుధీర్‌కుమార్ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వీరి నిరసనకు ఏఐటీయూసీ మద్ద తు పలికింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ అ సిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచకపోవడం దారుణమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడం సరికాదన్నారు. వేత న సవరణను తక్షణమే చేయాలని, ఆలస్యమయ్యే పక్షంలో మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఏఐటీయూసీ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు, ట్రిపుల్‌ఐటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడ సీతాపతి, వేణుగోపాల్, దుర్గాబాబు, వెంకటేశ్వర్లు, చింతమనాయుడు, గణేష్, జడ సుబ్బారావు, విజయశ్రీ, దీప్తి సాహూ, రచన,సుధీర్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
సీపీఎం సైతం..
ఏలూరు (టూటౌన్): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన పోరాటానికి సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తిచేయనందున అజాయ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ కాంట్రాక్టర్‌పై పోలీస్ కేసు నమోదు చేశామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్లతో, పీఎంఏవై 1.0 ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. పీఎంఏవై 1.0 ఆప్షన్–3కి సంబంధించి అజాయ వెంచర్స్ కాంట్రాక్టర్ 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారన్నారు. పూర్తిగా అలసత్వం వహించిన వీరిపై ఇళ్ల నిర్మాణాలకు మ్యాప్ చేసిన డివిజన్ల పరిధిలో పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో బాధ్యతారాహిత్యంగా ఉంటే క్షమించ బోమని హెచ్చరించారు. జిల్లాలో కాంట్రాక్టర్లు ఆప్షన్–3 కింద 6,271 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా 1,191 ఇళ్లను పూర్తిచేశారని, నిర్మాణాలు వేగిరపర్చాలన్నారు. పీఎంఏవై 1.0లో వివిధ కేటగిరీల కింద జిల్లాలో 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 36,052 నిర్మాణాలను పూర్తిచేశామన్నారు.
శ్రీవారి దేవస్థానం ఈఓగా భద్రాజీ


