మార్మోగిన గోవింద నామస్మరణలు
● కొత్త వత్సరం వేళ పోటెత్తిన భక్తులు ● కిటకిటలాడిన చినవెంకన్న ఆలయం
ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లలో భక్తులు
శ్రీవారిని దర్శిస్తున్న భక్తులు
ద్వారకాతిరుమల: ఏడాదంతా శుభప్రదం కావాలని కోరుతూ.. వేలాది మంది భక్తులు గురువారం చిన వెంకన్నను దర్శించారు. దీంతో ద్వారకాతిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు, పినకడిమి నుంచి పాదయాత్రగా బుధవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయాన్నే స్వామి, అమ్మవార్లను దర్శించారు. క్షేత్రంలోని అన్ని విభాగాల్లో భక్తులతో రద్దీ కనిపించింది. పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం వరకూ క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
భక్తులకు సౌకర్యాలు
శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు అధికారులు పలు సౌకర్యాలు కల్పించారు. పులిహోర, ఉప్మా, పండ్లను అల్పాహారంగా అందించారు. అలాగే పిల్లలకు పాలు, భక్తులకు నిరంతరాయంగా మంచినీరు అందించారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం కొంత సమయం రూ.500ల అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలను అధికారులు నిలుపుదల చేశారు. తరువాత మళ్లీ పునరుద్ధరించారు.
మార్మోగిన గోవింద నామస్మరణలు


