కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
నూజివీడు: ముసునూరు మండలం రమణక్కపేటలో ప్రియుడిని స్తంభానికి కట్టేసి కొట్టి, ప్రియురాలిని తీసుకెళ్లిన ఆరుగురు నిందితులను ముసునూరు పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ గురువారం రాత్రి నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన అల్లం సాయిచందు (22) హైదరాబాద్‌లో చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కందుల సాయిదుర్గ ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమన్ గా పనిచేస్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గతనెల 30న సాయిచందు, సాయిదుర్గను ఏలూరులోని గంగానమ్మ గుడి వద్ద వివాహం చేసుకున్నాడు. అనంతరం గతనెల 31న తన భార్య సాయిదుర్గను సాయిచందు డ్యూటీ నిమిత్తం రమణక్కపేట తీసుకెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సాయిదుర్గ తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మిలతో పాటు బంధువులు శివకృష్ణ, శిరీషా, గూడూరు విజయ, కందుల శివనాగప్రసాద్ అక్కడికి వచ్చి సాయిదుర్గను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి వెళ్లిన సాయిచంద్‌ను స్తంభానికి కట్టేసి అతనిపై కర్ర, వైర్లు, రాయి, చేతులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మరో పోస్టు ఉమన్ చెన్నకేశ్వరిపై కూడా దాడికి పాల్పడి సాయిదుర్గను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన అల్లం సాయిచందు, చెన్నకేశ్వరి ఇతరుల సాయంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముసునూరు ఎస్సై ఎం చిరంజీవి కేసు నమోదు చేశారు. దర్యాప్తు లో భాగంగా గురువారం విజయవాడ సమీపంలోని నున్న వద్ద ఆరుగురిని అరెస్టు చేసి, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్


