మంటగలుస్తున్న నూజివీడు ప్రతిష్ట
జూదాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
నూజివీడు: ఏలూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నూజివీడు చరిత్ర కూటమి ప్రభుత్వ హయాంలో జూదాల నిర్వహణతో మంట గలిసిపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున పేకాట జరుగుతున్న తీరుపై మంగళవారం ప్రతాప్ అప్పారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తరువాత నూజివీడుకు ఎందరో ప్రముఖులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారని, ఏనాడూ పేకాటను, ఇతర జూదాలను ప్రోత్సహించలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలోని గ్రామాల్లో పేకాట, కోడి పందేలు, చిత్తులాటలు పబ్లిక్‌గా నిర్వహిస్తున్నారన్నారు. గోవాలోని క్యాసినోలను తలపించేలా పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో పేకాట నిర్వహించడం చూస్తుంటే జూదాలను అరికట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున జూదాలు నిర్వహిస్తుంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఏం చేస్తున్నారో? తెలియడం లేదని దుయ్యబట్టారు. మూడేళ్ల క్రితం మ్యాంగో బేలో పేకాట నిర్వహించుకుంటామని కొందరు తన చుట్టూ తిరిగారని, దానికి తాను అంగీకరించలేదని చెప్పారు. 281 మంది జూదరులు, 140 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు దొరకడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని మేకా ప్రతాప్ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే మూడేళ్లలో నూజివీడు నియోజకవర్గంలో ఎంత పెద్ద స్థాయిలో జూదాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శించారు. జూదాలు, గ్రావెల్, మట్టి తవ్వకాలపై గతంలో పలుమార్లు తాము జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. జూదాలు, అక్రమ తవ్వకాలను ప్రభుత్వం నిలువరించకపోతే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.


