
రాయితీ ఎగ్గొట్టేందుకు కుట్ర
న్యూస్‌రీల్
అయ్యా.. యూరియా
● యూరియా దొరక్క రైతుల అవస్థలు
● సొసైటీల వద్ద పడిగాపులు
● పట్టించుకోని కూటమి సర్కారు
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఏలూరు (మెట్రో): జిల్లాలో యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు. సొసైటీల వద్ద పడిగాపులు, రోజంతా నిరీక్షణలు అన్నదాతలకు నిత్యకృత్యమయ్యాయి. యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతేడాది నుంచి రైతులకు సరఫరా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతూనే ఉంది. దీనిలో భాగంగా ఏటా అందించే యూరియా కోటాలో 1,000 టన్నులను గతేడాది తగ్గించింది. ఇలా యూరియాపై సబ్సిడీని ఎగ్గొట్టేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏలూరులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో యూరియా కొరత, కౌలు రైతుల దయనీయ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
కాల‘కూటమి’ విషం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. రైతు భరోసా సాయాన్ని ఏడాది పాటు నిలిపివేయడంతో పెట్టుబడుల కోసం రైతులు అవస్థలు పడ్డారు. అలాగే గ్రామాల్లో పూర్తిస్థాయిలో సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోంది. దీంతో రైతులకు సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందడం లేదు. ప్రధానంగా సీజన్ ప్రారంభంలో రైతులకు సమృద్ధిగా అందించాల్సిన యూరియాను సరఫరా చేయడంలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైంది.
గతమెంతో ఘనం.. ప్రస్తుతం ఎగనామం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా 2022–23లో జిల్లాలో 26,591 ట న్నులు, 2023–24లో 26,090 టన్నుల యూరియాను రైతులకు అందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ సీజన్‌లో 33,762 టన్నుల యూ రియా అవసరమని గుర్తించగా ఇప్పటివరకూ కేవలం 8 వేల టన్నుల మాత్రమే సరఫరా చేశారు. ఇక ఈ నెలలో 10,183 టన్నుల అవసరం అని అధికారిక గణాంకాలు చెబుతుంటే 5,496 టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంచారు.
రోజంతా ఉన్నా ఒక్క బస్తానే..
రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించడంతో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా అందుబాటులో ఉంచారు. యూరియా బస్తా ధర రూ.2,500కుపైగా ఉండగా రైతులకు రూ.266కు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీపై అందించాల్సి ఉంది. ఈ మేరకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో రైతులకు యూరియాను సరఫరా చేశారు. అయితే ప్రస్తుతం ఆ సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు కూటమి సర్కారు రైతులను ముప్పుతిప్పలు పెడుతుంది. రైతులు క్యూలో నిలబడి సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడితే ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తేనే పంపిణీ చేస్తున్నారు.
పోలవరం రూరల్: పోలవరం మండలం గూటాల సొసైటీ వద్ద శుక్రవారం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో తమకు ఇస్తారో లేదోనన్న ఆందోళనలో క్యూ కట్టారు. నాట్లు వేసిన పొలాలకు కలుపు తీసి యూరియాను చల్లుతున్నారు. ఈ సమయంలో యూరియా అవసరం అధికంగా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. రైతులకు యూరియాతో పాటు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించినట్టు వ్యవసాయాధికారి తెలిపారు. 1,500 ఎకరాలకు సరిపడా యూరియా, నానో యూరియా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
గతంలో జిల్లాలో యూరియా ఇబ్బందులు లేవు. ప్రస్తుతం ఒక్క యూరియా బస్తా కావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సొసైటీల వద్ద పడిగాపులు తప్పడం లేదు. మొబైల్‌కు ఓటీపీ వస్తేనే రైతులకు యూరియా ఇవ్వాలన్న నిబంధనతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– కోన శ్రీనివాసరావు, అడవికొలను
జిల్లాలో రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆందోళనకు సిద్ధమవుతాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో యూరియా కొరత నెలకొంది. నానో ఎరువుల పేరుతో అధికారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అనుమానంగా ఉంది.
– కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

రాయితీ ఎగ్గొట్టేందుకు కుట్ర

రాయితీ ఎగ్గొట్టేందుకు కుట్ర

రాయితీ ఎగ్గొట్టేందుకు కుట్ర