
ఉచిత బస్సుతో ఉపాధికి గండి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.గోపి, చక్రాల అమర్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్ర త్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రవాణా రంగం ద్వారా ప్రభుత్వా నికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా రవాణా రంగ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ చ ట్టాన్ని అమలు చేయకపోవడం ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనమన్నారు. భారీగా ఆటోలతో ర్యా లీని నిర్వహించడంలో బొడ్డేపల్లి చంద్రశేఖర్, బి.శ్రీనాథ్, అడ్డాల రాజు, నల్లమిల్లి నాగరాజు, బాష, శ్రీనివాసరావు, రాము ఇతర ఆటో యూనియన్ నాయకులు నాయకత్వం వహించారు. సీఐటీయూ నగర నాయకులు వైఎస్ కనకారావు, ఎం.ఇస్సాకు, పి.రవి మద్దతు తెలిపారు.