
కొత్త వీసీ ఎవరో?
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న డాక్టర్ కె.గోపాల్ పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. కొత్త వీసీ ఎవ్వరనేది ఇంకా స్పష్టం కాలేదు. కొత్త వీసీ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయలేదు. అధికారికంగా వీసీ నియామకానికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాస్తవానికి వీసీ నియామకానికి గాను సెర్చ్ కమిటీని ఏర్పాటుచేయాలి. వారు పరిశీలించిన దరఖాస్తుల్లో మూడు పేర్లను గవర్నర్‌కు పంపించాలి. ఆయన ఒకరి పేరును ప్రభుత్వానికి పంపించిన తరువాత వీసీని ప్రకటించాలి. కానీ ఇలాంటి తంతు ఏమీ లేకుండానే వీసీ నియామకానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఆశావహుల ప్రయత్నాలు
ప్రస్తుత వీసీ కె.గోపాల్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ పోస్టు కోసం గతంలో వర్సిటీలో అధికారులుగా పనిచేసిన దిలీప్‌బాబు, బి.శ్రీనివాసులు తదితరులు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
12 ఏళ్లుగా ఇన్‌చార్జిలే గతి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) నుంచి 2007 నుంచి ఎస్‌డీ.శిఖామణి, బీఎంసీ.రెడ్డి, తోలేటి జానకీరామ్ రెగ్యులర్ వీసీలుగా వచ్చి పనిచేశారు. ఆ తరువాత నుంచి 12 ఏళ్లుగా ఇన్‌చార్జి అధికారులనే నియమిస్తున్నారు. మరోసారి ఇన్‌చార్జి వీసీగా ఎవ్వరినైనా నియమిస్తారా లేదంటే ప్రస్తుత వీసీనే కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది.