
బస్సులు ఢీ.. విద్యార్థులకు గాయాలు
కాళ్ల: ఆగి ఉన్న కాలేజీ బస్సును మరో కాలేజీ బస్సు ఢీకొనడంతో రెండు బస్సుల్లో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం కాళ్లలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం భీమవరంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజ్ బస్సు విద్యార్థుల కోసం కాళ్లలో రోడ్డు పక్కన ఆగి ఉండగా, పెన్నాడలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లోనూ కలిపి 60 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. ప్రమాదంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. కొందరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల నియామకంలో కళాశాల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.