
సుందరగిరిలో వైభవంగా పవిత్రారోహణ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవరోజు బుధవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ యాగశాలలో ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, మూలవరులకు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు శేష వాహనంపై ఉంచి పూజలు నిర్వహించి అనంతరం దివ్య పవిత్రాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్, ఉత్సవ మూర్తులపై దివ్య పవిత్రాలను వేసి పవిత్రారోహణ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం మండప పూజలు, నిత్య హోమములు, మూలమంత్ర హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ సూచనలు, ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి పర్యవేక్షణలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం జరిగే పవిత్రావరోహణతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
స్వామివారి మూలవిరాట్‌పై పవిత్రాలను ఉంచి హారతులిస్తున్న అర్చకుడు
బంగారు శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తున్న పండితులు

సుందరగిరిలో వైభవంగా పవిత్రారోహణ