జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

Aug 18 2025 6:17 AM | Updated on Aug 18 2025 6:17 AM

జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

నూజివీడు: రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు అడ్డాగా మారింది. రేషన్‌ మొబైల్‌ వాహనాలను ఎత్తేసి నెల రోజులు గడిచిందో లేదో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. మొబైల్‌ వాహనాల వల్ల రేషన్‌ బియ్యం అక్రమ రవాణా పెరిగిందని సాకు చూపిస్తూ వాటిని రద్దు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నోరు మెదపడం లేదు. నూజివీడు ప్రాంతంలో గత నెలరోజుల వ్యవధిలోనే అక్రమంగా తరలిస్తున్న 118 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని నూజివీడు, ముసునూరు మండలంలో పట్టుకోవడం సంచలనంగా మారింది. జూలై 3వ తేదీన నూజివీడు బైపాస్‌ రోడ్డులో తరలిస్తున్న 51 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని, 5న నూజివీడు మండలం మొర్సపూడిలో 26 క్వింటాళ్లు, ఆగస్టు 7న ముసునూరు మండలం గుళ్లపూడిలో రేషన్‌ బియ్యంను అక్రమ రవాణా చేస్తుంటే విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. దీంతో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలుస్తోంది. పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు, మండలంలోని బత్తులవారిగూడెంకు చెందిన ప్రజాప్రతినిధి భర్త, టీడీపీకి చెందిన కార్యకర్త పెద్ద ఎత్తున బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే ఆగిరిపల్లికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక రేషన్‌ డీలరే యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన వీరందరూ తమకు అడ్డుకునే వారెవరూ ఉండరనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాన్ని మూడు లారీలు.. ఆరు ఆటోలుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని వీరు కొందరు ఏజంట్ల ద్వారా సేకరించి తమ అడ్డాకు చేర్చుకొని అక్కడ నుంచి లోడులు ఎత్తుతున్నారు.

కార్డుదారుల వద్ద

రూ.10కు కొనుగోలు చేస్తున్న రేషన్‌ డీలర్లు

డీలర్లు కార్డుదారుల వద్ద నుంచి రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా లాభాలు ఎక్కువగా ఉండటంతో కొందరు డీలర్లు ఏకంగా కార్డుదారుడి వద్దకే వెళ్లి బయోమెట్రిక్‌ వేయించుకొని కిలోకు రూ.10 చొప్పున చెల్లించి వెళ్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని డీలర్ల వద్ద నుంచి అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారులు కిలో రూ.17కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ డీలర్‌కు కిలోకు రూ.7 లాభం వస్తోంది. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్రమార్కులు కాకినాడ పోర్టుకు తరలించే మరొక పెద్ద వ్యాపారికి కిలో రూ.25 నుంచి రూ.27కు విక్రయించి కిలోకు రూ.7 నుంచి రూ.10 కు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పట్టుబడి కేసులు పెట్టినా అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారాన్ని మానకుండా మళ్లీ అదే దందా నడుపుతున్నారు. బియ్యం దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మొక్కుబడిగా 6ఏ కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బియ్యం మాఫియా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

దందాకు అడ్డాగా మారిన నూజివీడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement