102 ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
ఏలూరు (టూటౌన్): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ 102 ఉద్యోగుల వేతన బకాయిలు విడుదల చేయా లని, కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడి ప్రసాద్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని రోజుకి 10 గంటలు పని చేస్తున్నా ఉద్యోగులకు కేవలం రోజుకు రూ.280 మాత్రమే జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గత నాలుగు నెలల బకాయిలను విడుదల చేయాలని, కనీస వేతనం రూ.18,500కి పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈఏపీ సెట్‌కు 949 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలకు మంగళవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 999 మంది విద్యార్థులకు 949 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో 161 మందికి 149 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 161 మందికి 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 147 మందికి 141 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 190 మందికి 181 మంది, మధ్యాహ్నం 190 మందికి 185 మంది హాజరయ్యారు.
రేషన్ పంపిణీకి చర్యలు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామాల మధ్య నిర్వాసితుల కోసం నిర్మించిన నిర్వాసిత కాలనీకి తరలివచ్చిన నిర్వాసితులు రేషన్ బియ్యం కోసం సుమారు 335 కిలోమీటర్ల దూరం వెళ్ళి బియ్యం తెచ్చుకుంటూ పడుతున్న అవస్థలపై సాక్షి పత్రికలో మంగళవారం ‘రేషన్ కోసం అవస్థలు’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ శీర్షికపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరిపారు. కార్డుదారుల జాబితాను సేకరించి పోర్టబిలిటీ విధానంలో వచ్చే జూన్ నుంచి రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ పీఎస్‌ఆర్ శివరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 599 మంది గైర్హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 754 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 155 మంది మాత్రమే హాజరయ్యారు. 599 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానం సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ తెలుగు పేపర్‌కు మొత్తం 86 మందికి 71 మంది హాజరయ్యారు. హిందీ పరీక్షకు ముగ్గురుకు ముగ్గురూ హాజరయ్యారు. పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 112 మందికి 89 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరయ్యారు.
సర్పంచ్ చెక్ పవర్ రద్దు
టి.నరసాపురం: టి.నరసాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీ సర్పంచ్ కలపర్తి వెంకటేశ్వరమ్మ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ పంచాయతీ అధికారి కె.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగమయ్యాయని అదే గ్రామానికి చెందిన పాండురంగ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. నివేదిక ఆధారంగా సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేశారు. ఇదే అభియోగంపై బొర్రంపాలెంలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కేఎస్ కృష్ణను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు కార్యదర్శులు, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ నుంచి దుర్వినియోగమైన నిధులు రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.మణికుమారి తెలిపారు.


