పొగాకు రైతులను దెబ్బతీసిన వర్షం
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం పొగాకు రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. భారీ వర్షం రెడ్డిగణపవరంలోని పొగాకు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు. కనీస మద్దతు ధర కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది పొగాకు రైతులకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డుపై పడతామని ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రకృతి కూడా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వర్షానికి బేళ్లన్నీ తడిచిపోయాయి. బుధవారం ఉదయం తడిసిన బేళ్లను చూసిన రైతులు గుండెలు బాదుకున్నారు. వారికి జరిగిన నష్టాన్ని బోర్డు అధికారులకు తెలి యజేశారు. ఐటీసీ అధికారులు తడిచిన పొగాకును పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసారు. రెడ్డిగణపవరానికి చెందిన అల్లూరి సోమేశ్వరరావుకు చెందిన పొగాకు తడవడంతో సుమారు రూ.15 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అల్లూరి రామ్మోహన్‌రావుకు చెందిన బేళ్లు తడిచిపోయాయని కనీసం అమ్మకానికి కూడా వచ్చే పరిస్థితి లేదని అకాల వర్షం కారణంగా తనకు రూ. 10 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని చెప్పారు. మొత్తం రూ. 57 లక్షల వరకూ రైతులు నష్టపోయారు. ప్రభుత్వం, బోర్డు అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కారణంగా పొగాకు పంటలు పాడయ్యాయి.
పొగాకు రైతులను దెబ్బతీసిన వర్షం
పొగాకు రైతులను దెబ్బతీసిన వర్షం


