నారు.. అమ్మకాల జోరు | - | Sakshi
Sakshi News home page

నారు.. అమ్మకాల జోరు

Jul 1 2024 12:20 AM | Updated on Jul 1 2024 2:24 AM

నారు.

నారు.. అమ్మకాల జోరు

గణపవరం: ఏటా తొలకరి వచ్చిందంటే నారు వ్యాపారం జోరుగా సాగుతుంది. జూన్‌ నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఈ వ్యాపారం ఉంటుంది. వివిధ రకాల కూరగాయల మొక్కలు, పూలమొక్కలు, విత్తనాలను వారపు సంతలలో అమ్మకాలు చేస్తూ గణపవరం మండలం వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాలకు చెందిన సుమారు 100 మంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ గ్రామాలకు చెందిన కొందరు రైతులు దశాబ్దాలుగా కూరగాయలు, పూల మొక్కల నారు సాగు చేస్తూ, వాటిని జిల్లాలోని వివిధ గ్రామాలలో నిర్వహించే వారపు సంతలలో విక్రయిస్తుంటారు. సంతలు లేని రోజులలో సైకిళ్లపై గ్రామాలలో తిరుగుతూ నారు మొక్కలను అమ్ముతుంటారు. వేసవి తర్వాత జూన్‌లో వర్షాలు పడటం ఆరంభమవగానే ప్రజలు నారు మొక్కలు, విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వంగ, టమాటా, పచ్చిమిర్చితో పాటు బంతి, చామంతి, కనకాంబరం, గులాబి వంటి పూలమొక్కల నారు వారపు సంతలలో దుకాణాలు వేసి అమ్ముతుంటారు. వీటితో పాటు తోటకూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, చిక్కుడు, బీర, బెండ, వంగ, మిర్చి, పొట్ల, ఆనబ, గుమ్మడి, కాకర వంటి పలు రకాల కూరగాయల విత్తనాలు అమ్ముతుంటారు. ఒక్కో వ్యాపారి గ్రామాలలో తిరిగి రోజుకు రూ.రెండు నుంచి మూడు వేల విలువైన నారు విక్రయిస్తుండగా, అదే వారపు సంతలలో అయితే రూ.నాలుగైదు వేల వరకు అమ్మకాలు చేస్తారు.

కరోనాతో కష్టాలు

కరోనా అన్ని వర్గాలను కుదేలు చేసినట్లే నారు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో తయారై, అమ్మకానికి సిద్ధంగా ఉన్న నారు మొక్కలు ముదిరిపోయి వ్యాపారులకు రూ.లక్షల్లో నష్టాలు వచ్చేవి. విత్తనాలు కూడా అమ్ముడుపోక నిరుపయోగంగా మిగిలేవి. దీంతో వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారు. కరోనా తర్వాత కొంతకాలం అరకొరగా వ్యాపారం సాగినా పెద్దగా గిట్టుబాటు కాలేదు. గత రెండేళ్లుగా నారు వ్యాపారం కాస్త పుంజుకుంది.

వల్లూరు నారుకు డిమాండ్‌

వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాలలో సాగుచేసే నారుకు జిల్లా వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. ఈ గ్రామాలకు చెందిన పలువురు రైతులు నాలుగైదు దశాబ్దాల కాలంగా తమ పొలాల వద్ద, పుంతగట్లు, ఖాళీ దిబ్బలు, గ్రామ పంచాయతీ చెర్వు గట్లపై వివిధ రకాల నారు సాగు చేస్తుంటారు. 20 సెంట్ల నారుమడి తయారీ, విత్తనాలు, సస్యరక్షణకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ మడిలో వివిధ రకాల కూరగాయలు, పూల మొక్కల నారు సాగు చేస్తుంటారు. మే చివరి వారంలో నారు మడులు వేసి జూలై నుంచి నారు అమ్మకాలు ప్రారంభిస్తారు. ఇక్కడి వంగ, మిరప, టమాటా నారు మొక్కలు మంచి దిగుబడి ఇస్తాయని నమ్మకం. కొద్ది రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వ్యాపారులు నారు అమ్మకాలను ప్రారంభించారు.

కోతుల బెడదతో ప్రజల్లో తగ్గిన ఆసక్తి

గతంలో కూరగాయలు, పూల మొక్కల పెంపకంపై ప్రజలు ఆసక్తి చూపేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్ద కూరగాయల నారు, విత్తనాలు కొనుగోలు చేసి పెరటి పంటగా పండించే వారు. రైతులు కూడా పొలం గట్లపై కూరగాయల మొక్కలు పెంచేవారు. అయితే కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. ప్రస్తుతం ఏగ్రామంలో చూసినా కోతులు గుంపులుగా తిరుగుతూ పెరటి మొక్కలను పీకి పందిరేస్తున్నాయి. ఎంతో మక్కువగా పెంచిన మొక్కలకు కాసిన కూరగాయలను దక్కకుండా చేస్తున్నాయి. దీనితో ప్రజలకు కూరగాయల మొక్కలు పెంచాలన్న ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఈ ప్రభావం పరోక్షంగా నారు అమ్మకాలపై పడింది.

కూరగాయలు, పూల నారు విక్రయాలతో వల్లూరు, ముగ్గుళ్ల రైతుల జీవనోపాధి

వారపు సంతలలో ఎక్కువగా.. మిగిలిన రోజుల్లో ఊరూరా తిరిగి విక్రయాలు

కరోనా తరువాత పుంజుకుంటున్న వ్యాపారం.. 100 మంది రైతులకు ఉపాధి

గతంలో ఉన్న ఆదరణ లేదు

రెండు దశాబ్దాలుగా వారపు సంతలలో నారు, విత్తనాల వ్యాపారం చేస్తున్నాను. గతంలో ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు. కరోనా కారణంగా చాలా నష్టపోయాం. అప్పట్లో నారు పెంపకం, సస్యరక్షణకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కేదికాదు. దీనికి తోడు గ్రామాల్లో కోతుల బెడద వల్ల ప్రజలు కూరగాయల మొక్కల కొనుగోలును తగ్గించి వేశారు. ప్రభుత్వం చిరు వ్యాపారులకు సబ్సిడీపై రుణాలిచ్చి ఆదుకోవాలి.

– మంగెన రాంబాబు, నారు వ్యాపారి

అంతంతమాత్రంగా అమ్మకాలు

గతంలో సీజన్‌లో రోజుకు రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల విలువైన నారు మొక్కలు, విత్తనాలు అమ్మేవాళ్లం. ఇప్పుడు రోజుకు రూ.నాలుగైదు వందలు అమ్మడమే గగనంగా ఉంది. గతంలో మహిళలు పూలమొక్కలు, రైతులు విత్తనాలు తీసుకువెళ్లి పొలంగట్లు, దిబ్బలపై వేసేవారు. కోతుల పుణ్యమా అని పొలాల్లో కూరగాయల మొక్కలు పెంచడం రైతులు ఎప్పుడో మానేశారు. దీంతో వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంది. – బేతు శ్రీనివాసరావు, నారు వ్యాపారి

నారు.. అమ్మకాల జోరు 1
1/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 2
2/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 3
3/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 4
4/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 5
5/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 6
6/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 7
7/8

నారు.. అమ్మకాల జోరు

నారు.. అమ్మకాల జోరు 8
8/8

నారు.. అమ్మకాల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement