అయ్యో.. రొయ్య! | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. రొయ్య!

Aug 10 2025 6:02 AM | Updated on Aug 10 2025 6:02 AM

అయ్యో

అయ్యో.. రొయ్య!

పది రోజుల్లో ధరల వ్యత్యాసం (కిలోకు రూ.లలో)

కౌంట్‌ పది రోజుల క్రితం ప్రస్తుతం

100 270 220

90 280 230

80 290 255

70 320 275

60 360 295

50 370 315

40 400 335

30 470 385

సాక్షి, భీమవరం: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు ఆక్వాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దిగుమతులపై 50 శాతం పన్నుతో రొయ్య ధరలు కిలోకు రూ.50 నుంచి రూ.90 వరకూ పతనమయ్యాయి. అమెరికాకు ఎగుమతికాని 50 నుంచి 100 కౌంట్ల రొయ్యల ధరలను సైతం వ్యాపారులు తగ్గించేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే చేస్తున్నారని రైతులు అంటున్నారు. రాష్ట్రంలోని 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే 2.63 లక్షల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల దిగుబడితో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్‌ వరకు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్‌ వరకు చైనా, యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2023–24 గణాంకాల ప్రకారం ఏపీలో 10 లక్షల టన్నులు రొయ్యల దిగుబడి వస్తే వాటిలో 3.27 లక్షల టన్నులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.

మళ్లీ పతనం :

ఈ ఏడాది ప్రతికూల వాతావరణం, వైరస్‌ల బెడదతో ఆశించిన కౌంట్‌ రాకుండానే పట్టుబడులు చేయాల్సి వచ్చింది. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌ పెరిగి 100 కౌంట్‌ రూ.260–రూ.270 మధ్య, 30 కౌంట్‌ రూ.470, 40 కౌంట్‌ రూ.400లతో రైతుల్లో ఆశలు చిగురింపచేశాయి. ఇంతలో భారత ఉత్పత్తులపై ఆగస్టు 1 నుంచి 25 శాతం పన్ను, పెనాల్టీ విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన 24 గంటల వ్యవధిలో వ్యాపారులు కౌంట్‌ను బట్టి రొయ్య ధరలను రూ.60 వరకు తగ్గించేశారు. అమెరికా పన్నులు సాకుగా చూపించి కేవలం చైనా, యూరప్‌ దేశాలకు మాత్రమే ఎగుమతయ్యే 50 నుంచి 100 కౌంట్‌ రొయ్యల ధరలను తగ్గించేశారు.

సుంకాలను 50 శాతం వరకు పెంచినట్టు అమెరికా రెండోసారి చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత దిగజారింది. ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో కంపెనీలు, వ్యాపారులు చాలావరకు కొనుగోళ్లు నిలుపుచేశారు. ప్రస్తుతం పట్టుబడులకు వచ్చిన చెరువుల్లో వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిరోజులు లాభసాటి ధరతో ఆశలు రేకెత్తించిన రొయ్య ధరలు అంతలోనే పతనమవ్వడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎకరాకు రైతులు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టపోతున్నారు.

డాలర్‌ ధర పెరిగినప్పుడు ఆ లాభాన్ని పొందే ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్లు సుంకాల భారాన్ని తమపై మోపడం సరికాదంటున్నారు. ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడు, ఫీడు, వైరస్‌ల బెడద, కాటా మోసాలతో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని వాపోతున్నారు.

ఏప్రిల్‌ నుంచే సుంకాల బెడద

ఏప్రిల్‌ 3న అమెరికా పన్నుల పెంపు ప్రకటనను సాకుగా చూపించి కిలోకు 30 కౌంట్‌కు రూ.460, 40 కౌంట్‌కు రూ.370, 100 కౌంట్‌కు రూ.230 ఉన్న ధరలను ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు, ఎక్స్‌పోర్టర్స్‌, వ్యాపారులు రూ.30 నుంచి రూ.70 వరకు తగ్గించేశారు. పన్నులు పెంపు వాయిదా వేస్తున్నట్టు తర్వాత అమెరికా ప్రకటించినా ధరలు పెంచకుండా నెలరోజులకు పైగా తగ్గింపు ధరలనే కొనసాగించారు. సిండికేట్‌ దోపిడీ, కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. ఒక దశలో పశ్చిమగోదావరి జిల్లా రైతులు పిలుపునివ్వగా చాలామంది చెరువులను ఎండగట్టి పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీలను సైతం కట్టారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కూటమి ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేల వరకు తగ్గింపు, స్వల్పంగా రొయ్య ధరల పెంపు వంటి కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది.

రొయ్య ధరలు పతనం

కౌంట్‌కు రూ.50 నుంచి రూ.90 వరకు తగ్గించేసిన వ్యాపారులు

అయినా అంతంతమాత్రంగానే కొనుగోళ్లు

అమెరికాకు ఎగుమతి కాని రొయ్యల ధరలూ తగ్గించేసిన సిండికేట్‌

ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టపోతున్న రైతులు

కూటమి ప్రభుత్వం విఫలం

ఆక్వా రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. అమెరికాకు ఎక్స్‌పోర్టు కాని 50 నుంచి 100 కౌంట్ల ధరలను తగ్గించేసి దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాభాలు వచ్చినప్పుడు, డాలర్లు విలువ పెరిగినప్పుడు ఆ ప్రయోజనాన్ని వ్యాపారులే పొందుతున్నారు. ఇప్పుడు సుంకాల భారాన్ని రైతులపై మోపడం సరికాదు. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

–వడ్డి రఘురాం,

అప్సడా మాజీ వైస్‌ చైర్మన్‌, తాడేపల్లిగూడెం

అయ్యో.. రొయ్య!1
1/1

అయ్యో.. రొయ్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement