
ఒత్తిడితోనే రికార్డులు మారుస్తున్నారు
పాములపర్రులో కొనసాగుతున్న దళితుల నిరసన
ఉండి: కూటమి నాయకులు ఒత్తిడితోనే అధికారులు రికార్డులు మార్చేస్తున్నారంటూ పాములపర్రు దళితులు, దళిత సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములపర్రులో వివాదంగా మారిన శ్మశానంలో రోడ్డు నిర్మాణ ఘటనలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొద్ది రోజులుగా కూటమి నాయకులు, ఉద్యమాన్ని ఆపేది లేదని దళితులు చెబుతున్నారు.
శనివారం సాయంత్రం గ్రామంలో దళితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహుజన జేఏసీ కన్వీనర్ తాళ్ళూరి మధు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు, జేఏసీ గౌరవాధ్యక్షుడు స్టాలిన్‌బాబు మాట్లాడుతూ పాములపర్రులో ఒకపక్క దళితులు తమ శ్మశాన భూమి కోసం పోరాడుతుంటే మరో పక్క అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకంగా రెవెన్యూ రికార్డులనే మార్చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీకి గానీ, బోర్డు సభ్యులకు గానీ శ్మశాన వాటికకు సంబంధించి సమాచారం లేకుండా పంచాయతీ కార్యదర్శి పై అధికారులు కోరినట్లు తహసీల్దార్‌కు శ్మశాన సరిహద్దులు మార్చాలంటూ లేఖ రాయడం ఏంటని వారు మండిపడ్డారు. తామంతా రాజీపడిపోయామని సమస్య సద్దుమణిగిపోయిందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దళితులు తప్పుపట్టారు. 150 ఏళ్ల నుండి శ్మశానంగా వున్న భూమిని ఎలా మారుస్తారని ఏ విధంగా భూస్వాములకు కొమ్ముకాస్తున్నారని ప్రశ్నించారు. పక్క గ్రామానికి చెందిన ఇద్దరు ఆక్వా రైతుల ప్రాపకం కోసం అధికారులు, కూటమి నాయకులు ఇంత దారుణానికి ఎలా ఒడిగడతారని మండిపడ్డారు. ఏ అర్హతతో పంచాయితీ కార్యదర్శి లేఖ రాశారని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంచాయతీకి సంబంధం లేదు
సరిహద్దులు మార్చాలని పంచాయతీ సమావేశంలో ఎలాంటి చర్చ రాలేదని ఒకటో వార్డు సభ్యుడు దర్శి సాల్మన్ తెలిపారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న పంచాయితీ కార్యదర్శి అప్పారావుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలో జేఏసీ రాష్ట్రాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేష్ బాబు, దానం విద్యాసాగర్, మామిడిపల్లి ఏసేబు, దర్శి దేవానందం, ఆనందరావు, మత్తి చంద్రం, బడుగు ఆదాము, వజ్రపు సుందరరావు, దర్శి వెంకటరత్నం, దర్శి చంద్రం, తదితరులు పాల్గొన్నారు.