
ధరల సెగ.. సర్కారు దగా
రూ.1.94 కోట్ల గౌరవ వేతనం బకాయి
ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వ హయాంలో ధరలు చుక్కలు చూపెడుతున్నా విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పని చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహకులు, హెల్పర్లు వంటలు మానలేదు. కూరగాయల ధరలు రెట్టింపైనా అందుకు సంబంధించిన ధరలను మాత్రం ప్రభుత్వం పెంచకుండా పాత ధరలే ఇప్పటికీ చెల్లిస్తోంది. ధరలు పెంచుతామని ప్రకటించినా దానిని అమలు చేయడంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది. దీనితో నిర్వాహకులు, హెల్పర్లకు ఆర్థిక భారం పెరిగి విద్యార్థులకు భోజనం పెట్టడానికి అప్పుల పాలవుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం విద్యార్థికి ఇంత అని ధరను నిర్ధేశించింది. ఆ ధరకే వండి పెట్టాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్ధేశించిన ధరలనే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తోంది. ప్రస్తుతం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటాలు, వంకాయలు, బెండకాయలు వంటి కూరగాయల ధరలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ధరలు నిర్ణయించే సమయానికి కిలో రూ.18 ఉన్న ఉల్లిపాయలు ప్రస్తుతం రూ.25, కిలో రూ.16 ఉన్న పచ్చిమిర్చి ఇప్పుడు రూ.50, కిలో రూ.12 ఉన్న టమాటాలు ఇప్పుడు రూ. 48 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ కూరగాయ ధర రెట్టింపైంది.
జూనియర్ కళాశాలలకు బిల్లులపై మౌనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో 19 జూనియర్ కళాశాలలకు చెందిన 3,860 మంది విద్యార్థులు, 26 హైస్కూల్ ప్లస్‌కు చెందిన 586 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు గత జనవరి 4 నుంచి కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుండగా అప్పటి నుంచి ఇంత వరకూ వారికి చెల్లించాల్సిన మొత్తంలో ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. జనవరి నుంచి పరీక్షలు జరిగే వరకూ మూడు నెలలు, కళాశాలలు పునఃప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ మరో మూడు నెలలు వెరసి ఆరు నెలలకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం రోజుకు 4,446 మంది కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.8.57 చొప్పున రోజుకు రూ.38,102 చెల్లించాలి. ఈ లెక్కన ఇంత వరకూ మొత్తం 132 పని దినాలకు రూ.50.29 లక్షలు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయిపడింది.
న్యూస్‌రీల్
బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలి
జిల్లాలో పేద కుటుంబాలకు చెందిన వారే మధ్యాహ్న భోజన కుక్‌లు, హెల్పర్లుగా పని చేస్తున్నారు. ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడంతో అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం బకాయి ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన రూ. 50.29 లక్షలు, గౌరవ వేతనం బకాయిలు రూ.1.94 కోట్లు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం పెంచుతామని ప్రకటించిన భోజనం తయారీ ధరను లక్షణమే పెంచి అమలు చేయాలి.
– మొడియం నాగమణి, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
మధ్యాహ్న భోజనం కుక్ అండ్ హెల్పర్లకు రెండు నెలల వేతనం బకాయి
రెట్టింపైన కూరగాయల ధరలతో అవస్థలు
జనవరి నుంచి జూనియర్ కళాశాలల బిల్లులకు మొండిచేయి
కూరగాయల ధరలు పెరిగినా, ప్రభుత్వం భోజన తయారీ ధర పెంచకపోయినా విద్యార్థులను పస్తులు పెట్టడం ఇష్టం లేక నిర్వాహకులు వండి వడ్డిస్తున్నారు. ప్రభుత్వం వారిపై కనికరం చూపడం లేదు. గౌరవ వేతనం కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,232 మంది కుక్‌లు, హెల్పర్లు పని చేస్తున్నారు. జిల్లా మొత్తం కుక్‌లు, హెల్పర్లకు రూ.96.96 లక్షలు చెల్లించాలి. గత రెండు నెలలుగా రూ.1.94 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. చెల్లించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లాలో మొత్తం 1749 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుండగా 1,06,021 మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు రూ. 5.88 చొప్పున, 6 నుంచి 10 వరకూ రూ. 8.57 చొప్పున చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇటీవల భోజనం తయారీ నిమిత్తం చెల్లించే ధరను 1 నుంచి 5వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు 59 పైసలు, 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 88 పైసలు పెంచుతామని ప్రకటించింది. అది ప్రకటనకే పరిమితమై అమలుకు మాత్రం నోచుకోలేదు.

ధరల సెగ.. సర్కారు దగా

ధరల సెగ.. సర్కారు దగా