
శ్రీవారి క్షేత్రంలో డ్రోన్ కలకలం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ప్రధాన రాజగోపురంపై శనివారం రాత్రి డ్రోన్ ఎగరడంతో కలకలం రేగింది. ఆలయ భద్రతలో భాగంగా దేవాలయంపై డ్రోన్ ఎగరడాన్ని అధికారులు నిషేధించారు. క్షేత్రంలో వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక డ్రోన్ ఆలయ ప్రధాన రాజగోపురంపై చక్కర్లు కొట్టింది. దాంతో అప్రమత్తమైన దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది డ్రోన్ ఎగరవేస్తున్న వ్యక్తిని పట్టుకుని, అతడితో పాటు డ్రోన్‌ను స్థానిక పోలీస్టేషన్‌లో అప్పగించారు.
బిల్లులు సమర్పించడానికి గడువు పొడిగించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల పొజిషన్ ఐడీలు ఇంకా కొంతమందికి రావలసి ఉన్నందున జీతాల బిల్లులు సమర్పించడానికి ఈ నెల15 వరకు గడువు పెంచాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు కోరారు. శనివారం ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం స్థానిక ఇఫ్టూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రెడ్డి దొర మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన మూల్యాంకన పుస్తకాల వల్ల విద్యార్థికి ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోగా ఉపాధ్యాయులకు అనవసర పనిభారం పెరిగి బోధనా సమయాన్ని హరించి వేసేవిగా ఉన్నాయన్నారు. ఉపాధ్యక్షుడు బీ.శ్యాంసుందర్ మాట్లాడుతూ ఇంతవరకు పీఆర్‌సీ కమిషన్ నియమించకపోవడం, ఐఆర్ కూడా ప్రకటించకపోవడం బాధాకరమని, వెంటనే పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను ప్రకటించాలన్నారు. ఎంఈఓ 1, 2 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు ఎస్.దొరబాబు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్‌కే.రంగావలి, కై కలూరు నాయకులు వీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కే కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య సహాయకులను నియమించాలి
భీమవరం: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నుంచి తొలగించిన ఆరోగ్య సహాయకులను పునర్నియామకం చేయాలని పారా మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జీవీవీ ప్రసాద్ కోరారు. గత డిసెంబర్ 5న అధికారులు హడావుడిగా తొలగించిన రాష్ట్రంలోని 920 మంది ఆరోగ్య సహాయకుల కుటుంబాలు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సహాయకులుగా ఉద్యోగాలు చేస్తూ వాటిని కోల్పోయిన వారంతా యాభై ఏళ్ళు వయస్సు పైబడ్డ వారేనని ఇలాంటి తరుణంలో ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాల పరిస్థితి ఏంటనేది ప్రజాప్రతినిధులు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కలుగజేసుకుని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆరోగ్యసహాయకుల ఖాళీల వివరాలను ప్రభుత్వం కోర్టుకు సమర్పించడమేగాకుండా మెరిట్ ఆధారంగా అందరినీ తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పారా అథ్లెటిక్స్‌లో ప్రతిభ
ద్వారకాతిరుమల: విశాఖ పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో ద్వారకాతిరుమల మండలం రాజా పంగిడిగూడెం గ్రామానికి చెందిన యువకుడు కస్సే పవన్‌కుమార్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు, 6 అడుగుల లాంగ్ జంప్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఈనెల 22 నుంచి గ్వాలియర్‌లో జరిగే జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పవన్‌కుమార్ మాట్లాడుతూ తన లక్ష్యం 2026లో బెంగళూరులోని ఏఐ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో చేరి దేశానికి ప్రాతినిధ్యం వహించడమేనని అన్నారు. తాను జంగారెడ్డిగూడెంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు చెప్పాడు.
11 నుంచి ఏబీవీపీ
కార్యవర్గ సమావేశాలు
భీమవరం: ఏబీవీపీ కార్యవర్గ సమావేశాలు ఈనెల 10,11 తేదిల్లో భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి చెప్పారు. శనివారం భీమవరంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది పాల్గొంటారన్నారు.