థ్యాంక్యూ టీచర్‌

Teachers Day: Nature and characteristics of teachers that children admire - Sakshi

టీచర్స్‌ డే

‘మా టీచర్‌ ఇలా చెప్పలేదు’
‘మా టీచర్‌ ఇలాగే చెప్పింది’
‘మా టీచర్‌ కోప్పడుతుంది’
‘మా టీచర్‌ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్‌ టీచర్‌ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్‌ టీచర్‌ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్‌ఫర్‌ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్‌ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు.

పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్‌ టీచర్‌ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్‌ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్‌ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్‌ టీచర్‌ క్లాస్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్‌ టీచర్‌. ఆ టీచర్‌ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్‌ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్‌ బాగా వస్తోంది సైంటిస్ట్‌ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్‌ అయినవారున్నారు. ఫేవరెట్‌ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్‌ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు.

► సబ్జెక్ట్‌ బాగా వచ్చినవారు
ఫేవరెట్‌ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్‌ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్‌ టీచర్‌ అవుతారు. సబ్జెక్ట్‌ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్‌ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్‌ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్‌ ఎవరికైనా సరే ఫేవరెట్‌ టీచర్‌.

► మనలాంటి వారు
పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్‌’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్‌ అంటే ఆ స్టూడెంట్‌ కనెక్ట్‌ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్‌. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్‌ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్‌ టీచరే.

► అందరూ సమానమే
ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్‌ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్‌ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్‌ ఉండాలి. కొంతమంది స్టూడెంట్‌లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్‌లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్‌ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్‌ ఫేవరెట్‌ టీచర్‌.

► క్రమశిక్షణ
పిల్లలు తమ ఫేవరెట్‌ టీచర్‌లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్‌ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్‌ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్‌ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్‌ టీచర్లు అనుకోరు.

టీచర్‌ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్‌ డే’ శుభాకాంక్షలు.

► మంచి ఫ్రెండ్‌
కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్‌ సపోర్ట్‌ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top