breaking news
Attitudes
-
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు. -
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
సంధ్యాసమయం
క్లాసిక్ కథ మాకు వివాహమైన ఆ మరుసటి రోజునుంచే, నేను ఆమె కలిసి ఒకసారి బొంబాయి వెళ్లి రావాలని నా భార్య చెప్పసాగింది. అక్కడే ఆమె మాతామహుడు, మాతామహి ఉన్నారు. పెద్దతనం మూలాన వాళ్లు బెంగుళూరులో జరిగిన మా వివాహానికి రాలేకపోయారు. అందువల్ల మేమైనా తప్పకుండా వాళ్లని చూసి, వాళ్ల ఆశీస్సులు పొంది రావాలని మా శ్రీమతి అభిలాష. నాకూ అభిలాషగానే వుంది. డెబ్భై అయిదేళ్లు దాటిన వారంటే నాకెప్పుడూ అభిమానమూ ఆకర్షణా ఉండేవి. ప్రత్యక్ష పోటాపోటీలు వాదోప వాదాలంటే నాకు భయం. అందువల్ల వాటికి ఒదిగి సంచరించే నా స్వభావం ఒక కారణం కావచ్చు. సమవయస్సు వారితోనే - అంతెందుకు సొంత సోదర సోదరీమణులతో కూడా - పోటీలు, ఈర్ష్యలు, అభిప్రాయ భేదాలు కలుగుతూవుండడం వల్ల సుహృద్భావపూరితమైన సంబంధానికి విఘాతం ఏర్పడుతున్నది. కాని నా కంటె ముప్పయి అయిదు, నలభైయేళ్ల పెద్దవాళ్లతో నాకెలాంటి స్పర్ధ లేదు. విరోధమూ లేదు. తమ కాలపు ధోరణులకూ విలువలకూ సాధకంగానూ, వర్తమానకాలపు ధోరణులకు బాధకంగాను వీళ్లు మాట్లాడుతుంటే, నా తరానికి చెందిన విజయ సాధకుల తలమీద మొట్టికాయలు మొట్టినట్లుగా కనిపిస్తుంది నాకు. అది నాకెంతో సంతోషం కలిగిస్తుంది. కాని మా బొంబాయి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి గత సంవత్సరానికి మా వివాహమై దగ్గర దగ్గర అయిదేళ్లు కావస్తుంటే - మేము బొంబాయి వెళ్లాము. ఆ వృద్ధులు సహజంగానే మరీ వృద్ధులయ్యారు. మేము బొంబాయి వెళ్లేటప్పటికి తాతగారికేమో తొంభై తొమ్మిదేళ్లు; అవ్వగారికేమో దాదాపు డెబ్భై నాలుగేళ్లు. వి.టి., మరీన్డ్రైవ్, మలబార్ హిల్స్ ప్రాంతాలతో పోల్చి చూస్తే, డొంబివిలీ-అంటే ఆ వృద్ధులు నివసించే ప్రాంతం - ఎనభై ఒకటిలోనూ గ్రామంగానే కనిపించింది. ఆ వృద్ధులకు మా శ్రీమతి తల్లితో కలుపుకుని నలుగురు కుమార్తెలు; ఒకే పిల్లవాడు. ఈ పిల్లవాడు సకుటుంబంగా మలబార్ హిల్స్‌లో ఒక ఆధునిక ఫ్లాట్‌లో కాపురముంటున్నాడు. తల్లిదండ్రుల్ని తనతోపాటే ఉండమని ఆయన పిలుస్తున్నాడట. కాని తాతగారు డొంబివిలీ విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదట. ఈ అయిదేళ్లలో నా భార్య ఆ వృద్ధుల్ని గురించి వివరంగానే చెప్పింది. వాళ్ల తాతయ్య ఆ కాలపు నిక్కచ్చి మనిషి అట; ఆయన్ని చూసి అందరూ గజగజ వణికిపోయేవారట, ఆఫీసులోనూ ఇంట్లోనూ కూడా. రైల్వేలో స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాడు. నిర్వహణ యంత్రాంగాన్ని రాజకీయవాదులు దిష్టిబొమ్మగా తయారుచేసిన యీ రోజుల్లో జెనరల్ మేనేజర్లకు కూడా గౌరవం కాని మర్యాద కాని లేదు. కాని ఆ రోజుల్లో, అంటే ఇంగ్లీషువాడి రోజుల్లో అన్నమాట, మామూలు సూపరింటెండ్లకు కూడా ఆత్మాభిమానమూ హోదా ఉండేవట. (అని వాళ్ల తాతయ్య చెప్పినట్లుగా నా భార్య చెప్పింది). సమర్ధుడైతే దొరలతో సరిసమానంగా సంచరించే అవకాశం ఉండేదట. ఇలాంటి అవకాశాలు పొందినవాడట ఆ తాతగారు. అందువల్ల డిపార్టుమెంటే తనకు నమస్కారం చేసేలా ఆయనవల్ల వీలయిందట. ఆయన యింటి పనులన్నీ కూడా వుద్యోగులే సలాం పెడుతూ వచ్చి చేసి వెళ్లేవారట. ఇంక చెప్పాలా? ఇంట్లోనూ ఆయన ఒక నియంత... ఆమె అవ్వగారు కూడా మన పరంపరాగతమైన ప్రత్యేకతల్ని యింకా సరిగా తెలుసుకోలేని స్త్రీత్వపు ఉత్తమ ప్రతినిధి. సూటిగా వెళ్లే రకం. సూక్ష్మబుద్ధి, వివేకం కలది. వాటికి తోడుగా సహనం కలది. గృహకృత్యాలు, బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తూ వచ్చింది ఆవిడే. ఈ విషయంలో తాతగారు పెద్ద జీరో. ఉన్నట్టుండి కోపం తెచ్చుకోవడం, మండిపడడం, ఇంట్లో సామాన్లు ఎడాపెడా విసిరివెయ్యడం ఆయనకి మామూలు. తమ నలుగురు కుమార్తెలకు (మా అత్తగారితో సహా) వివాహాలు జరిగింది ఆవిడ వల్లనే; ఆమె చాలామంది స్నేహితురాండ్ర వల్లనే. తాతగారికి అందుకు కావలసిన సామర్ధ్యమో సాహసమో లేదు. (నా భార్య స్త్రీ కావడం వల్ల, తన అవ్వగారిని గురించి కొంచెం ఎక్కువగానే పొగడింది. కేవలం శాంపిల్ మాత్రమే తెలియజేశాను.) కాగా ఆ జూన్ మిట్టమధ్యాహ్నమప్పుడు డొంబివిలీలోని నా భార్య తాతగారి యింటిని సమీపిస్తుంటే నాలో ఒకటే తహతహ. చారిత్రక వ్యక్తుల్ని కలుసుకునే ఒక ఆదుర్దా. అవ్వగారే తలుపు తెరిచారు. క్షణంలో మమ్మల్ని గుర్తుపట్టి ఆహ్వానించారు. ఆ ఆహ్వానంలో ఒక సంకోచం కనిపించింది. దానికి కారణం నేనే అనుకుని బాధపడ్డాను. అవ్వగారికీ మనుమరాలికీ మద్య నేనొకణ్ని అవతరించాను! ఆవిడ ముఖంలో ‘లక్ష్మీకరమైన’ (శుభప్రదమైన) అంటారు చూడండి, అలాంటి కళ. ఊరికే వింత చూసేవారిని స్పందింపజేయని కళ... నేనే కనక మగవాణ్ని కాకపోతే, యింకా కొంచెంసేపు ఆ ముఖాన్ని చూస్తూ వుండవచ్చు; ఆ శోభలో లీనమైపోయి వుండవచ్చు. ఆవిడ మా మూడేళ్ల అమ్మాయిని తనవద్దకు రమ్మని పిలవగా, యిదియేమో బెదురుతూ నన్నే చూడగా, బిస్కెట్లు వెతకడానికి ఆవిడ లోనికి వెళ్లింది. ఆ పాతకాలపు పెంకుటింటిని నేను పైకీ కిందకీ చూశాను. ఆ నాలుగు గోడల మధ్య జరిగిన జీవిత నాటకాన్ని కల్పన చేసుకుంటూ కూర్చున్నాను. నా భార్య, ఆమె తల్లి - యిద్దరూ యీ యింట్లోనే పుట్టారు... ఉన్నట్టుండి నా భార్య ఒక పాత్రతో వచ్చింది. ‘‘డయరీ నుంచి పాలు తీసుకురావడానికి అమ్మమ్మ బయలుదేరింది. నాకు చోటు తెలుసుగదా. నేనే వెళ్లి వస్తానన్నాను. ఇప్పుడే వస్తాను’’ అంటూ నా భార్య వెలుపలికి వెళ్లింది. ఆమెతో పాటు మా అమ్మాయి కూడా బయటికి పరుగెత్తింది. నేనూ ఆవిడా మాత్రమే మిగిలాము. ఆవిడతో మాట్లాడడానికి నాకేవేవో విషయాలున్నట్లుగా అనిపించింది. అయితే దేన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడ కూడా నాతో ఏదో మాట్లాడదలచినట్లు... ‘‘ఈ ఇంజనీర్లంతా వచ్చారు యివాళ...’’ అంది ఆవిడ హఠాత్తుగా. నాకేమీ అర్థం కాలేదు. ‘‘ఇక్కడ లోపల సిగ్నలింగ్ సిస్టం, ట్రాక్ ఎత్తులు వాలు ప్రదేశాలు అవన్నీ సరి చూసి, కొత్త సాధనాలు సిఫారసు చెయ్యడానికి ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు...’’ ‘‘ఓ!’’ అన్నాను. అవ్వగారు ఇంగ్లీషు మాటలు బోలెడు అనాయాసంగా వాడడం నాకు ఆశ్చర్యం వేసింది. ‘‘జపాన్‌లో అంతా వేగంగా రైళ్లు వెడుతున్నాయి గదా! అందుకు తగినట్టుగా ట్రాక్, సిగ్నలింగ్ అంతా మాడర్నైస్ చేసి వుంచారు... ఇక్కడ మాదిరిగానా?’’ ఈ విధంగానే ఆవిడ మాట్లాడసాగింది. నాకదంతా సరిగా జ్ఞాపకం లేదు. ఆశ్చర్యంలో మునిగిపోయి నోరు మూసుకుని కూర్చున్నాను. అప్పుడే నా భార్య తిరిగి వచ్చింది. ఆమె రావడంతో ఆవిడ మాట్లాడడం ఆపివేసింది. మేమందరం కాఫీ తాగుతున్నప్పుడు తాతగారు వచ్చారు. పోస్టాఫీసులో ఆలస్యమైపోయిందని క్షమాపణ చెప్పుకున్నారు. ఇంగ్లాండులో ఉన్న తన సహాధ్యాయుడికి ఉత్తరం వ్రాసి వచ్చారట. ‘‘నీకూ కాఫీ కలపనా తాతయ్యా’’ అని అడిగింది నా భార్య. ‘‘నాకు టీయే.’’ ‘‘సరే’’ అంటూ ఆమె లేచింది. కాని, ‘‘నువ్వు కూర్చో, నువ్వు కూర్చో’’ అని ఆయన ఆమెను కూర్చోబెట్టాడు. ‘‘ఇప్పుడు నేనిటువంటి పనుల్లో ఎక్స్పర్ట్నయ్యా. నీకు తెలుసా?’’ అన్నాడు. వంటింటికి వెళ్లి, తానే టీ తయారు చేసుకోసాగాడు. నేనూ లేచి అక్కడికి వెళ్లాను. వెంటనే ఆయన వంటింట్లో టైము మిగిల్చే నిమిత్తం తాను చేసిన కొత్త ఏర్పాట్ల గురించి సంతోషంగా వివరించాడు- తోమి బోర్లించిన పాత్రల నుంచి త్వరగా నీళ్లు కారేందుకు గాను ఏటవాలుగా ఉండే ఒక కొయ్య పలక, పొయ్యిమీద ఎక్కువ కాంతిపడేందుకు ఒక కొత్త లైట్ పాయింట్... ఇదంతా నాకు కొత్తగా కనిపించలేదు. ఈయనేనా నా భార్య వర్ణించిన నియంత అని ఆశ్చర్యపడ్డాను... ఆ రాత్రి మేము బస చేసిన యింటికి (ఇది నా భార్య పిన్నిగారిల్లు, తాతగారి మరొక కుమార్తె) తిరుగు ముఖం పట్టిన తర్వాత, డొంబివిలీ తాతయ్య అమ్మమ్మలు గురించి చాలా విషయాలు తెలియవచ్చాయి. అమ్మమ్మకు చిత్తభ్రమ మొదలయిందట; ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నదట; పాత విషయాలు ఏకరువు పెడుతున్నదట. మునుపు తాతగారో - మరెవరో ఆవిడతో మాట్లాడిన మాటలో లేకపోతే వినిపించేలా మాట్లాడిన మాటలో... ఓ! అలా అయితే ఆవిడ నాతో ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడిన మాటలన్నీ... నాకు అదోలా అయిపోయింది. ఆవిడ చదువుకున్నదీ కాదు. అయినా కూడా ఎప్పుడో విన్నది అలాగే ఒప్ప చెప్పుతున్నదంటే మేధావిగా ఉండాలి! ఈ మేధావి తన కాలమంతా వంటింట్లోనే గడిపి వేసింది. ఛీ... ఆవిడ ప్రస్తుత పరిస్థితినీ చిత్తభ్రమనూ యితరులు వర్ణించడమూ నాకు చికాకు కలిగించింది. ఇందుకు మరో అందమైన వివరణ ఉండకూడదా అనిపించింది. ఆ తర్వాత కూడా కొన్ని తడవలు ఆ వృద్ధుల్ని చూడడానికి వెళ్లాము. ఒకసారి తాతగారే భోజన పాత్రల్ని తోమి బోర్లిస్తున్నారు. ఆ రోజు అమ్మమ్మకు ఏమీ బాగోలేదట! తాతగారే వంట చేశారట. ఇంకో రోజు. తాతగారప్పుడు ఇంట్లో లేరు. మమ్మల్ని చూసి అమ్మమ్మ తన ఇంగ్లీషు పాండిత్యాన్ని దులిపి వేసింది. రైల్లో మేము మా ఊరికి ప్రయాణమైనాము. నా భార్యకు ఆ వృద్ధుల జ్ఞాపకం వచ్చింది. ఉన్నట్టుండి ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘ఏడవకు, ఏడవకు’’ అన్నాను ఓదారుస్తూ. కాని నాకు కూడా ఏడుపు వచ్చేంత పని అయింది. ‘‘తాతయ్య, అమ్మమ్మ - ఆ యిద్దర్లో ఎవరు ముందర పోయినా సరే మరొకరికి ఎంత దుఃఖంగా వుంటుందో! అది అనుకోడానికే బాధగా వుంది...’’ అంటూ మళ్లీ ఏడవసాగింది. నా మనస్సులో ఏదో తళుక్కుమంది. ఇదే సంగతి - అనుకున్నాను. తాతగారూ అవ్వగారూ తమకు తెలియకుండానే తరువాతి వారి మరణానికి తమను సిద్ధం చేసుకుంటున్నారు. తాతగారు అవ్వగారుగా మారిపోయి వంట చేస్తున్నారు. అవ్వగారేమో తాతగారై ఆంగ్లంలో... తాము బ్రతికినన్నాళ్లూ ధరించిన సాంఘిక వేషాల కోసం ఒకరిని చూసి మరొకరు పరితపిస్తున్నట్టుగా కనిపించింది. ఈ వేషాలు కల్పించిన గీతల్ని మచ్చల్ని యిద్దరూ ఒకరికొకరు సానుభూతితో తడవి చూసుకుంటున్నట్టుగా తోచింది. అవ్వగారు తల్లిగా, వంటింటి రాణిగా మెలిగిన పరిస్థితిని తాతగారూ, తాతగారు తండ్రిగా బయట తిరిగే వ్యక్తిగా మెలిగిన పరిస్థితిని అవ్వగారూ గ్రహిస్తున్నట్టుగా కనిపించింది. ఈ భావాన్ని శ్రీమతికి విశదీకరించాలని నాకనిపించింది. కాని వెంటనే ఒక సందేహం - తనకు పవిత్రంగా కనిపించిన దేనిమీదనో నేను ముదురు రంగులు పులిమి పాడుచేస్తున్నానని ఆమె భావించదు గదా! ఆమెతో నేనేమీ చెప్పలేదు. మేము ఢిల్లీ చేరుకున్న రెండు నెలలకల్లా డొంబివిలీ అవ్వగారు కాలధర్మం చేసినట్టుగా కబురు వచ్చింది. వెంటనే నాకు తాతగారు పాత్రలు తోమి బోర్లిస్తున్న ఆ దృశ్యమే స్ఫురణకు వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆయన్ని గురించి అనుకునేటప్పుడు, మునుపటికంటె ఆయన ఎక్కువగా వంటింట్లోనే మసులుతూ వుండవచ్చుననే స్ఫురిస్తుంది. మరొకటి కూడా స్ఫురిస్తోంది. ఆయన ఆంగ్లం మాట్లాడడం మానివేసి వుండవచ్చు. - కె.యస్.సుందరం (‘మొదట రాత్రి వస్తుంది’ సంకలనం నుండి)