Sakshi News home page

కనీసం ఇప్పటికైనా...

Published Fri, Nov 24 2023 11:59 PM

sakshi editorial governer powers - Sakshi

దేన్నయినా పదే పదే చెప్పవలసిరావటం ఎవరికైనా ఇబ్బందే. అందునా రాజ్యాంగ పదవుల్లో వున్నవారికి పదే పదే రాజ్యాంగ నిబంధనలు గుర్తుచేయటం మరింత ఇబ్బందికరమైన వ్యవహారం. కానీ మన సర్వోన్నత న్యాయస్థానానికి ఇది తప్పడం లేదు. తమ శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాలు చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ గవర్నర్ల అధికారాలకుండే పరిధులు, పరిమితుల గురించి సుప్రీంకోర్టు మరోసారి చెప్పక తప్పలేదు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఈనెల 10న వెలువడిన ఆ తీర్పు పూర్తి పాఠం గురువారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో వెలువడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును నిలిపి వుంచేందుకు, వెనక్కి పంపేందుకు రాజ్యాంగంలోని 200వ అధికరణ గవర్నర్‌కు అధికారమిస్తోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్‌ భావించినప్పుడు దాన్ని తిప్పిపంపొచ్చు. అయితే ఆ సందర్భంగా గవర్నర్‌ ఏం చేయాల్సివుంటుందో కూడా అదే అధికరణ వివరిస్తోంది. గవర్నర్‌ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక యధాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని కూడా అదే అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్‌ ఆమోదించి తీరాలని ఆ అధికరణ వివరిస్తోంది. నిబంధనలు ఇంత స్పష్టంగా వున్నప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి నిర్ణయం చెప్పకుండా బిల్లుల్ని పెండింగ్‌లో వుంచటం అసమంజసం, రాజ్యాంగ విరుద్ధం. కానీ మన దేశంలో పదే పదే ఇలాగే జరుగుతోంది.

ఇతరేతర వ్యవస్థలు కాలానుగుణంగా ఎంతోకొంత మార్పులు చెందుతూ వచ్చాయి. గవర్నర్ల వ్యవస్థ మాత్రం అన్నింటికీ అతీతంగా వుండిపోయింది. అంతక్రితం సర్కారియా కమిషనైనా, ఆ తర్వాత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషనైనా రాజకీయ నేతలకు ఆ పదవులు ఇవ్వొద్దని సూచించాయి. గవర్నర్‌ పదవిని రాజకీయ పునరావాసంగా మార్చొద్దని 1994లో ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కూడా హితవు చెప్పింది. రాజకీయాలకు అతీతంగా వుండే వ్యక్తులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులైనవారు ఆ పదవిలో వుంటే మంచిదని సర్కారియా కమిషన్‌ సూచించింది. కానీ  కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ ఆ సూచన శిరోధార్యమని భావించలేదు. ఇటీవల గవర్నర్లకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య తరచు వివాదాలు తలెత్తు తున్నాయి. పంజాబ్‌తోపాటు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వా లకూ, గవర్నర్లకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

పంజాబ్‌లో మరీ విపరీతం. అక్కడ ఏకంగా 12 బిల్లుల విషయంలో గవర్నర్‌ ఎటూ తేల్చకుండా ఆపేశారు. గవర్నర్లు ఇలా వ్యవహరించటం వల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వాలు చులకనవుతాయి. సమస్య అపరిష్కృతంగా వుండిపోవటా నికి కారణం తెలియక అధికార పక్షంపై సామాన్యులు విరుచుకుపడతారు. బహుశా అలా జరగాలని గవర్నర్లు కోరుకుంటున్నారేమో తెలియదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలపట్ల ఇలా చిన్నచూపుతో వ్యవహరించటం తమ పదవిని తామే చిన్నబుచ్చుకోవటమని గవర్నర్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సమస్యేమంటే తమ ఏలుబడిలోని ప్రభుత్వాలకు గవర్నర్‌లు ఇబ్బందిగా మారినప్పుడు కొత్తగా మొదటిసారి ఇలా జరుగుతున్నట్టు మాట్లాడే పార్టీలు, గతంలో తాము అధికారంలో వుండగా వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోతాయి. దేశంలో ఏ మూలైనా గవర్నర్‌కూ, ఒక ప్రభు త్వానికీ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా కేంద్రంలోని జనతాపార్టీ ప్రభుత్వం గుర్తుకు రాకమానదు. 

1977లో జనతాపార్టీ అధికారంలోకి రాగానే ఒకే వేటుతో పది రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద బర్తరఫ్‌ చేసింది. 1980లో కేంద్రంలో మళ్లీ అధికారం వచ్చాక కాంగ్రెస్‌ ఇదే పని చేసింది. ప్రజల ఆమోదంతో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలను ఇలా ఇష్టానుసారంగా, కక్ష పూరితంగా రద్దు చేయటం దారుణమని ఆ రెండు పార్టీల ప్రభుత్వాలూ అనుకోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగాక బొమ్మై కేసులో సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అలాంటి చర్యకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం వుండితీరాలన్న నిబంధన విధించింది. అటు తర్వాత ఈ నిరంకుశ విధానానికి ఏదోమేరకు బ్రేకు పడిందనే చెప్పాలి. ఇప్పుడు పంజాబ్‌
విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఊరట వచ్చినట్టే. 

ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బిల్లులు పెండింగ్‌లో వుంచటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఫెడరల్‌ వ్యవస్థలో గవర్నర్ల పాత్రేమిటన్న అంశంలో మన రాజ్యాంగ నిర్మాతలకు తగిన అవగాహన లేకపోవచ్చు. కానీ ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలనటం ద్వారా గవర్నర్ల బాధ్యతేమిటో స్పష్టంగా చెప్పినట్టయింది. చట్టాల రూపకల్పనలో శాసనసభల పాత్ర వమ్ము అయ్యేలా అధికారాలను వినియోగించటం సరికాదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చెప్పటం హర్షించదగింది. మరోసారి ఇలా చెప్పించుకోవాల్సిన అవసరం రాకుంటే తమకే గౌరవప్రదమని గవర్నర్లు గుర్తించటం మంచిది.

Advertisement

What’s your opinion

Advertisement