పాత కాపులకే పట్టం

Sakshi Editorial On Five State Elections Results 2022

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన పది రోజులకు ఎట్టకేలకు అన్నిచోట్లా ముఖ్య మంత్రుల ఎంపిక ప్రహసనం ముగిసింది. పంజాబ్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (ఆప్‌)ని మినహాయిస్తే, మిగతా 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొత్తవే కానీ సారథులు పాతవాళ్ళే. ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారం నిలుపుకొన్న బీజేపీ చిత్రంగా పాత కాపులపైనే మళ్ళీ భరోసా పెట్టింది. పార్టీలోనూ, బయటా తిరుగులేని యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని యూపీ సంగతి వేరు. ఆ ఒక్కటీ అటుంచితే, అసమ్మతుల మొదలు అధికారం కోసం పోటీ దాకా అనేకం ఉన్న రాష్ట్రాల్లోనూ పాత సారథులకే బీజేపీ జై కొట్టడం గమనార్హం. మణిపూర్‌లో బీరేన్‌ సింగ్‌ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయగా, మరో 3 రాష్ట్రాల్లో ఈ వారంలోనే ప్రమాణ స్వీకారోత్సవాల హంగామా. 

పదిరోజుల ఊహాగానాల తర్వాత ఉత్తరాఖండ్‌లో... సొంత సీటులో ఓటమి పాలైన పుష్కర్‌ సింగ్‌ ధామీనే మళ్ళీ సీఎంగా పార్టీ ఎంపిక చేయడంతో ఇప్పుడు చర్చంతా ఈ పాత కాపుల విజయసూత్రాల చుట్టూ నడుస్తోంది. 70 స్థానాల ఉత్తరాఖండ్‌లో 47 సీట్లు గెలిచి, బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీ అనే ఘనత దక్కించుకుంది. అయితే, పోటీ చేసిన ఖటీమా నియోజకవర్గం నుంచి సీఎం ధామీ ఓడిపోవడం పార్టీకి పెద్ద షాక్‌. ధామీ ఓడారు గనక ఆ పదవి తమకు దక్కుతుందని ఇతర సీనియర్లు ఆశపడ్డారు. రకరకాల పేర్లు వినవచ్చాయి. పరిశీలకులుగా అధిష్ఠానం పంపిన మంత్రుల సమక్షంలో మంగళవారం ఆ ఊహాగానాలకు తెర పడింది. «45 ఏళ్ళ దామీకే మళ్ళీ సీఎం పీఠం లభించింది. 

ఈ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు వివిధ రాష్ట్రాల్లో సీఎంలను పేక ముక్కలలా మార్చారన్న అపకీర్తి బీజేపీ మూటగట్టుకుంది. ఆ అప్రతిష్ఠకు భిన్నంగా ఇప్పుడు ఫలితాలు వచ్చాక పాత సారథు లనే ఆ పార్టీ కొనసాగించింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో గత మార్చిలో ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను మార్చారు. వచ్చిన తీరథ్‌ సింగ్‌ రావత్‌ సైతం వివాదాస్పద మయ్యారు. స్త్రీల వస్త్రధారణపై వ్యాఖ్యలు, హరిద్వార్‌ కుంభమేళాలో కోవిడ్‌ నిబంధనల వైఫల్యం, టీకాల డేటాలో ప్రభుత్వ మతలబుల లాంటి కారణాలతో పదవి పోగొట్టుకున్నారు. ఆయన స్థానంలో గత జూలైలో పగ్గాలు చేతబట్టి, ఉత్తరాఖండ్‌కు సీఎం అయ్యారు ధామీ. ఓటమి అంచున ఉందనుకున్న పార్టీ అదృష్టాన్ని తిరగరాశారు. తీరా ఓడిపోతుందనుకున్న బీజేపీని గెలిపించారు. సొంత సీటులో ఓడినా, పదవి రేసులో మాత్రం అధిష్ఠానం ఆశీస్సులతో గెలిచారు. 

మణిపూర్‌ సంగతికొస్తే, 79.85 శాతంతో దేశ సగటు కన్నా ఎక్కువ అక్షరాస్యత రేటున్న ఈ కీలక సరిహద్దు రాష్ట్రంలో తీవ్రవాదం, జాతుల ఘర్షణ కూడా ఎక్కువే. 60 స్థానాల ఈశాన్య రాష్ట్రంలో 2017లో బీజేపీ గెలిచింది 21 సీట్లే. అప్పట్లో 28 సీట్లతో కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించినా, కమలనాథులే ప్రభుత్వం ఏర్పాటుచేయడం మరో పెద్ద కథ. ఆటుపోట్లెన్నో తట్టుకుంటూ అయిదేళ్ళుగా విజయవంతంగా మైనారిటీ ప్రభుత్వం నడిపారు బీరేన్‌ సింగ్‌. తాజా ఎన్నికల్లో పార్టీ బలాన్ని 32కు పెంచి, మెజారిటీ సాధించి పెట్టారు. సీఎం సీటుకు ఇతరులు పోటీ పడ్డా, బీరేన్‌కు అది అనుకూలించింది. బీరేన్‌ నియంతృత్వ ధోరణిని నిరసించే అసమ్మతి వర్గం చివరకు ఏమీ చేయలేకపోయింది. అధిష్ఠానం సహజంగా విజయసారథి వైపే మొగ్గింది. ఎన్నికల అనంతరం ఆరుగురు ఎమ్మెల్యేల జనతాదళ్‌ (యు), అయిదుగురు ఎమ్మెల్యేల నాగాలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ మద్దతుతో ఈసారి బీరేన్‌ది సుస్థిర సర్కార్‌. నాగాలాండ్‌ సరిహద్దు గ్రామాలతో ఘర్షణలు, నిరుద్యోగం, వివాదాస్పద సాయుధ బలగాల చట్టం లాంటి వాటిని బీరేన్‌ ఎలా పరిష్కరిస్తారో? 

ఎమ్మెల్యేల బేరసారాలకూ, పార్టీ ఫిరాయింపులకూ పేరుపడ్డ 40 స్థానాల గోవాలో గతంలో అతి పెద్ద పార్టీ కాంగ్రెసైనా, బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ చీలిక వర్గం వచ్చి కలవడం కలిసొచ్చింది. తాజా ఎన్నికల్లో మాత్రం మెజారిటీకి ఒక్క సీటు తక్కువగా 20 సీట్లతో బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, అంతర్గత కలహాలు, సీఎం ఆశావహులతో చిక్కొచ్చింది. పార్టీని గెలిపించిన ప్రమోద్‌ సావంత్‌ సొంత పార్టీలోని ప్రత్యర్థి విశ్వజిత్‌ రాణే లాంటి వారిని దాటుకొని రావాల్సిన పరిస్థితి. ఫలితాలొచ్చి పది రోజులు దాటినా, అనేక కారణాలతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. అమిత్‌ షా స్వయంగా ప్రమోద్, విశ్వజిత్‌లతో భేటీ జరిపినట్టు వార్తలొచ్చాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టిన ప్రమోద్‌నే సారథిగా అధిష్ఠానం మరోసారి ఎంచుకుంది. 

ఎన్నికలలో అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకతకు ఎదురొడ్డి, ముందుండి మరీ పార్టీని గెలిపించడం ఈ రెండోసారి సీఎంలకున్న సానుకూలత. బీరేన్, ధామీ, ప్రమోద్‌ సావంత్‌లకు మళ్ళీ సీఎం పీఠం దక్కింది అందుకే. బీజేపీ నేతలూ ఆ మాటే చెబుతున్నారు. అయితే, శాసనసభా పక్ష సమావేశాల్లో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నిక లాంటి లాంఛనపూర్వక మాటలకు చాలా ముందే రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంటి పరిశీలకుల నోట కాబోయే ముఖ్యమంత్రులెవరో సూచనలు వచ్చేశాయి. ‘‘మ్యాచ్‌ను అద్భుతంగా ముగించే క్రికెటర్‌ ధోనీ లాంటి వారు ధామీ’’ లాంటి వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. మొత్తానికి, ఒకప్పటి కాంగ్రెస్‌ అధిష్ఠానం లాగే, నేటి బీజేపీ కూడా సీల్డ్‌ కవర్‌ సీఎంల సంస్కృతికి అతీతమేమీ కాదని తాజా సీఎం ఎంపికలతో తేలిపోయింది. పార్టీ జెండాను మరింత పైకెత్తడంలో ఈ సరికొత్త పాత సీఎంలు సఫలమైతే అధిష్ఠానానికి అంతకు మించి ఇంకేం కావాలి! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top